AP Sachivalayalu: ఏపీలో గ్రామ-వార్డు సచివాలయాల పునర్నిర్మాణం.. సేవల మెరుగుదలపై దృష్టి
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేలా ఈ వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సచివాలయాల ద్వారా అందుతున్న పౌర సేవలపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటి పనితీరు, ప్రభుత్వ శాఖలతో సమన్వయం, సచివాలయాల బాధ్యతలు, అధికారాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు సమీపంలో ఉండేలా మెరుగైన సేవలను అందించేందుకు పునర్ వ్యవస్థీకరణను చేపట్టాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు. సచివాలయాల పనితీరు, అందించే సేవలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.
సచివాలయాల ఉద్యోగులకు భద్రత పెంపు
ముఖ్యమంత్రి ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడమే కాక, సచివాలయ ఉద్యోగులకు క్రమబద్ధమైన ఉద్యోగ బాధ్యతలు కల్పించడం, వారి శిక్షణను పెంచడం వంటి అంశాలపై చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,291 గ్రామ పంచాయతీలు ఉన్నా, 11,162 గ్రామ సచివాలయాలు మాత్రమే ఉన్నాయి. మొత్తం 15,004 గ్రామ-వార్డు సచివాలయాల్లో 1,27,175 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 39.54% మంది 18-27 సంవత్సరాల వయసున్న యువత, 43.07% మంది 28-37 సంవత్సరాల వయసున్న ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఈ ఉద్యోగులను సక్రమంగా వినియోగించుకునే విధానంపై కూడా సమావేశంలో పలు అంశాలను చర్చించారు.. ప్రభుత్వం ఈ సచివాలయ వ్యవస్థపై సమూల మార్పులు చేయాలని భావిస్తోంది, తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించనుంది.