Loading...
Revanth Reddy Delimitation: డిలిమిటేషన్‌పై కేంద్రంతో ఢీ కొట్టేందుకు సిద్దమైన రేవంత్‌ రెడ్డి
డిలిమిటేషన్‌పై కేంద్రంతో ఢీ కొట్టేందుకు సిద్దమైన రేవంత్‌ రెడ్డి

Revanth Reddy Delimitation: డిలిమిటేషన్‌పై కేంద్రంతో ఢీ కొట్టేందుకు సిద్దమైన రేవంత్‌ రెడ్డి

వ్రాసిన వారు Balachander Sharma
Nov 29, 2026
10:29 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్రం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ తన పోరాటాన్ని మరింత ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం రాత్రి ఢిల్లీకి బయలుదేరారు. డీలిమిటేషన్ వల్ల తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు ఎదురయ్యే రాజకీయ, సామాజిక ప్రభావాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడమే ఈ పర్యటనలో ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఆదివారం కర్ణాటక, కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి ఉమ్మడి మీడియా సమావేశంలో పాల్గొననున్నారు. నాలుగు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదికపై తమ అభ్యంతరాలను వెల్లడించనుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Details

నలుగురు సీఎంలతో కలిసి ఉమ్మడి గళం

ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగే మీడియా సమావేశంలో డీలిమిటేషన్ బిల్లుతో తలెత్తే సమస్యలను ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది.

నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యానికి నష్టం కలిగే అవకాశాలపై ప్రధానంగా మాట్లాడాలని ఏఐసీసీ సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సమావేశం తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో భేటీ కానున్నారు.

పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు.

పార్టీ విప్‌ జారీ చేసిన నేపథ్యంలో ఎంపీలంతా ఉదయం 10 గంటలకల్లా ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఆదేశాలు వెళ్లాయి.

Details

రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రశ్నలు

డీలిమిటేషన్‌ ప్రక్రియ కేవలం నియోజకవర్గాల సరిహద్దుల మార్పు మాత్రమే కాదని, దాని ప్రభావం రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయంపై కూడా ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అంశంపై కేంద్రాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. అధికార పార్టీకి అనుకూలంగా రాజకీయ పటాన్ని మార్చే ప్రయత్నం జరిగితే గట్టిగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.

అణగారిన వర్గాల ప్రాతినిధ్యం తగ్గేలా ఎలాంటి నిర్ణయాన్నీ అంగీకరించబోమని స్పష్టం చేశారు. నియోజకవర్గాల సరిహద్దులను ఏ ప్రాతిపదికన మార్చబోతున్నారో కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

దీంతో డీలిమిటేషన్ అంశం రాబోయే రోజుల్లో పార్లమెంటులోనే కాకుండా రాష్ట్రాల రాజకీయాల్లోనూ కీలక చర్చగా మారే అవకాశం కనిపిస్తోంది.

ADVERTISEMENT