Future City: ఫ్యూచర్‌సిటీలో 37 గ్రామాల విలీనం.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం..
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్‌సిటీ ప్రాజెక్టుకు మరింత విస్తరణ లభించింది. ప్రజల విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరో 37 గ్రామాలను ఫ్యూచర్‌సిటీలో విలీనం చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో మహేశ్వరం మండలంలోని 28 గ్రామాలు, కందుకూరు మండలంలోని తొమ్మిది గ్రామాలు ఈ మెగా ప్రాజెక్టులో భాగం కానున్నాయి. కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రులతో కలిసి కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఎఫ్‌సీడీఏ కమిషనర్ శశాంక సంస్థ కార్యకలాపాలను సీఎంకు వివరించారు. సంస్థ ఛైర్మన్ హోదాలో సీఎం తన ఛాంబర్‌లో తొలి ఫైల్‌పై సంతకం చేశారు.
వివరాలు
సభా వేదికపైనే ప్రజల వినతిపత్రాలపై సీఎం సంతకం
ఈ సందర్భంగా ఫ్యూచర్‌సిటీ అధికారిక పోర్టల్‌ను ప్రారంభించిన సీఎం, తెలంగాణ రైజింగ్-2047 గ్లోబల్ సమిట్‌కు సంబంధించిన దృశ్యాలను వీక్షించారు. బిల్డ్‌నౌ పోర్టల్ ద్వారా భవనాలు, పరిశ్రమలు, గృహ నిర్మాణాలకు అవసరమైన అనుమతులను ఎఫ్‌సీడీఏ జారీ చేయనుంది. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఫ్యూచర్‌సిటీలో తమ గ్రామాలను చేర్చాలని స్థానిక ప్రజలు ప్లకార్డులతో విజ్ఞప్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సభా వేదికపైనే ప్రజల వినతిపత్రాలపై సీఎం రేవంత్‌రెడ్డి సంతకం చేసి, 37 గ్రామాలను ఫ్యూచర్‌సిటీలో విలీనం చేయాలని అధికారులను ఆదేశించారు.
వివరాలు
ఎఫ్‌సీడీఏ కార్యాలయంలో సౌర విద్యుత్ వ్యవస్థలు, బయో ఎస్‌టీపీలు ఏర్పాటు
దేశంలోనే తొలి స్మార్ట్ పారిశ్రామిక నగరంగా ఫ్యూచర్‌సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే పర్యావరణ హిత భవనంగా గుర్తింపు పొందిన ఎఫ్‌సీడీఏ కార్యాలయంలో సౌర విద్యుత్ వ్యవస్థలు, బయో ఎస్‌టీపీలు ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఇక్కడ అత్యాధునిక పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థలు, రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేయనున్నారు. వాతావరణ మార్పులను తట్టుకునేలా ప్రతి భవనాన్ని నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
వివరాలు
అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి: భట్టి విక్రమార్క
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. ఫ్యూచర్‌సిటీ పేరుతో భూములు లాక్కుంటున్నారనే ప్రచారం అవాస్తవమన్నారు. స్థానిక ప్రజలే తమ గ్రామాలను ఈ ప్రాజెక్టులో భాగం చేయాలని కోరుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో కాలుష్యాన్ని పెంచే పరిశ్రమలను తీసుకురావాలని ప్రయత్నించిందని విమర్శించిన భట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా అభివృద్ధి చేస్తుందని స్పష్టం చేశారు. ఫ్యూచర్‌సిటీలో ఆధునిక పరిశ్రమలతో పాటు రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌లు, కార్మికుల పిల్లల కోసం విద్యాసంస్థలు, స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
వివరాలు
కాలుష్య రహిత పరిశ్రమలకే ప్రాధాన్యం: మంత్రి శ్రీధర్‌బాబు
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త తరహా నగరాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఫ్యూచర్‌సిటీని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రెండున్నరేళ్లలో ప్రాజెక్టు మరో కీలక దశకు చేరుకుందని చెప్పారు. ఎఫ్‌సీడీఏ పరిధిలోని గ్రామాలు, పట్టణాల్లో జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు రహదారులు, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల్లో ఎలాంటి రాజీ ఉండదన్నారు. ఫ్యూచర్‌సిటీలో కాలుష్య రహిత పరిశ్రమలకే అనుమతి ఉంటుందని, భూములు ఇచ్చిన వారికి పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌కు హైటెక్ సిటీ ఎంత గుర్తింపు తీసుకొచ్చిందో, భవిష్యత్తులో భారత్ ఫ్యూచర్‌సిటీ కూడా అంతే గుర్తింపు పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వివరాలు
భావినగర నిర్మాణానికి ప్రజల సహకారం అవసరం: ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే భావినగర నిర్మాణానికి స్థానిక ప్రజలు, రైతులు సహకరించాలని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ చరిత్రలో ఇలాంటి ప్రణాళికాబద్ధ నగరం లేదన్నారు. గతంలో ఫార్మాసిటీ పేరుతో భూములు కోల్పోయిన రైతులకు అన్యాయం జరిగిందని, కానీ ఫ్యూచర్‌సిటీ విషయంలో అలాంటి పరిస్థితి ఉండదని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ మేరకు భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేస్తామని, ఒక్క రూపాయి కూడా నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.