Osmania Hospital: రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. గోషామహల్‌లో ఉస్మానియా కొత్త హాస్పటల్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. గోషా మహల్‌లో ఉస్మానియా హాస్పటల్ కొత్త భవనాన్ని నిర్మించాలని ఆయన అధికారులను ఆదేశించారు. దీని కోసం కార్యాచరణ ప్రణాళికను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. గోషా మహల్‌లోని పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు దాదాపు 32 ఎకరాల స్థలం ఉంది. పోలీస్ విభాగం ఆధ్వర్యంలో ఉన్న ఈ స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని సీఎం ఆదేశించారు. అక్కడే ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి ఏర్పాట్లు చేయనున్నారు.
అభివృద్ధి పనులపై సమీక్షా
రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ ప్రణాళికతో ఉన్న వివిధ అభివృద్ధి పనులపై సీఎం సచివాలయంలో తొలి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. 19 పనుల్లో ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణం, 15 కొత్త నర్సింగ్ కాలేజీలు, 28 కొత్త పారామెడికల్ కాలేజీలు, జిల్లాల్లో సమాఖ్య భవనాల నిర్మాణాలకు సంబంధించి ప్రణాళికలపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆస్పత్రి నిర్మాణ డిజైన్లు ఉండాలన్నారు. ప్రస్తుతం గోషా మహల్‌లో ఉన్న పోలీస్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను అక్కడికి తరలించేలా చూడాలన్నారు.
నర్సింగ్ కాలేజీ భవనాలను ఏడాదిలోగా పూర్తి చేయాలి
తెలంగాణ రాష్ట్రంలో నిర్మించే ఆస్పత్రి పనులను వేగవంతం చేసి, 15 నర్సింగ్ కాలేజీ భవనాలను వచ్చే ఏడాదిలోగా పూర్తి చేయాలన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు పది జిల్లాల్లో సమాఖ్య భవనాలున్నాయని, మిగతా 22 జిల్లాల్లో కొత్త భవనాల నిర్మాణం చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ లోని శిల్పారామం పక్కనే మహిళా శక్తి సంఘాలకు కేటాయించిన మూడు ఎకరాల స్థలాన్ని వెంటనే ఆ విభాగానికి బదిలీ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.