Revanth reddy: 'పద్మ' అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల నగదు: రేవంత్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వం 'పద్మ' అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పద్మవిభూషణ్ అవార్డులకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి సహా ఇతర 'పద్మ' అవార్డులను పొందిన తెలుగువారిని తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సన్మానించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పద్మ అవార్డు గ్రహీతలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 లక్షలను అందజేస్తామని ప్రకటించారు. అలాగే, ప్రతినెలా వారికి రూ.25వేల పింఛన్ కూడా అందజేస్తామని చెప్పారు. దిల్లీకి వెళ్లే తెలుగు రాజకీయ నేతలకు వెంకయ్యనాయుడు పెద్దదిక్కు అన్నారు. పున్నమినాగులో చిరంజీవి ఏ స్థాయిలో నటించారో.. ఇప్పుడు కూడా అదేస్థాయిలో నటిస్తున్నట్లు చెప్పారు. ఇది రాజకీయాలకు అతీతంగా నిర్వహించిన కార్యక్రమం అన్నారు.
గద్దర్ పేరుతో అవార్డు ఇవ్వడం సముచితం: చిరంజీవి
తెలుగు రాష్ట్రాల్లో కొన్నేళ్లుగా నంది అవార్డులు ఇవ్వలేదని ఈ సందర్భంగా చిరంజీవి స్పందించారు. అయితే ఇప్పుడు తెలంగాణలో గద్దర్ పేరుతో కళాకారులకు అవార్డులు ఇస్తామని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. పద్మ అవార్డు గ్రహీతలకు ఈ విధంగా ప్రభుత్వం సన్మానం చేయడం ఇదే మొదటిసారి అన్నారు. తెలుగు భాషను దిల్లీ స్థాయిలో నిలబెట్టిన వారిలో వెంకయ్య నాయుడు ఒకరని చిరంజీవి అన్నారు. అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడారు. పద్మ విభూషణ్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించిన రేవంత్ రెడ్డిని వెంకయ్య అభినందించారు. రేవంత్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మెగాస్టార్ చిరంజీవిని తెలుగు కళామతల్లికి మూడో కన్నుగా వెంకయ్య అభివర్ణించారు.