
Operation Akhal: హల్గాం దాడికి ప్రతీకారం.. 'ఆపరేషన్ అఖాల్' ఓ ఉగ్రవాది హతం
ఈ వార్తాకథనం ఏంటి
హల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భద్రతా బలగాలు ఉగ్రవాదులపై దాడులు ముమ్మరం చేశాయి. వరుస ఆపరేషన్లతో ఉగ్రవాద గుట్టును కనుక్కొని ధ్వంసం చేస్తున్నారు. ఈ పరిణామాల్లో భాగంగా తాజగా 'ఆపరేషన్ అఖాల్ (Operation Akhal)' పేరిట జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. దక్షిణ కశ్మీర్‌లోని అఖాల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందడంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని ముట్టడి చేసి సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు దళాలపై కాల్పులు ప్రారంభించగా, భద్రతా బలగాలు అదే స్థాయిలో ఎదురుదాడికి దిగాయి. ఎదురుకాల్పులలో ఒక ఉగ్రవాది హతమవ్వగా, మరో ఇద్దరు ఉగ్రవాదులు చిక్కినట్లు అధికారులు తెలిపారు.
Details
ఇప్పటివరకూ 12 మంది ఉగ్రవాదులు మృతి
ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని స్పష్టం చేశారు. గతంలో జరిగిన పహల్గాం ఉగ్రదాడి(ఏప్రిల్ 22)అనంతరం కేంద్రం ఆపరేషన్ 'సిందూర్' పేరుతో ప్రతిస్పందన చర్యలు ప్రారంభించింది. మే 7న ప్రారంభమైన ఈ ఆపరేషన్ కింద భద్రతా బలగాలు పలు ఉగ్ర ముఠాలపై జల్లెడ పడుతున్నాయి. ఇందులో భాగంగా 'ఆపరేషన్ మహాదేవ్ (Operation Mahadev)'చేపట్టగా, పహల్గాం ఘటనకు బాధ్యులైన ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్రం ప్రకటించింది. ఆపై 'ఆపరేషన్ శివశక్తి'(Operation Shiv Shakti)లో మరో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు. ఇప్పటివరకు ఈ వరుస ఆపరేషన్లలో 12 మంది ఉగ్రవాదులు భద్రతా బలగాల చేతిలో మృతి చెందారు. వారిలో ఆరుగురు పాకిస్థాన్‌కు చెందినవారిగా గుర్తించగా, మిగిలిన ఆరుగురికి జమ్మూ కశ్మీర్‌లో జరిగిన పలు ఉగ్రదాడులతో సంబంధం ఉందని అధికారులు వెల్లడించారు.