Kolkata Rape Case : ఆర్‌జి కర్ ఆసుపత్రి అత్యాచారం.. సంజయ్ రాయ్‌పై సీబీఐ చార్జ్‌షీట్
ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచారం, హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ ఘటన ఆగస్టు 9న చోటుచేసుకుంది. అందులో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో సంజయ్ రాయ్‌పై కేసు నమోదైంది. ఆసుపత్రి సెమినార్ రూమ్‌లో అత్యాచారానికి గురై హత్యకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. బాధితురాలు అర్ధరాత్రి విశ్రాంతి కోసం గదిలోకి వెళ్లింది. ఆ గదిలోనే ఆమె మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా, బాధితురాలిపై 25 అంతర్గత, బాహ్య గాయాలు ఉన్నాయని, ఆ తర్వాత ఆమెను హత్య చేసినట్లు వైద్యులు నిర్ధారించారు.
హత్యను ఆత్మహత్యగా మార్చేందుకు ప్రయత్నాలు
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సంజయ్ రాయ్ ఆగస్ట్ 9న తెల్లవారు 4.03 గంటలకు సెమినార్ గదిలోకి ప్రవేశించి, సుమారు 30 నిమిషాల తర్వాత బయటకు వచ్చినట్లు రికార్డైంది. సీబీఐ విచారణలో సంజయ్ రాయ్ లై డిటెక్టర్ పరీక్షకు హాజరయ్యాడు. తాను సెమినార్ హాల్‌లోకి వెళ్లినప్పుడు బాధితురాలు అపస్మారక స్థితిలో ఉన్నారని, భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పేర్కొన్నాడు. ఈ కేసులో ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ కూడా సీబీఐ చేత అరెస్టయ్యాడు. ఆయనపై బాధితురాలి కుటుంబాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడని, హత్యను ఆత్మహత్యగా మార్చేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి.