Rhea Singha: 'మిస్ యూనివర్స్ ఇండియా 2024'గా రియా సింఘా
ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని రియా సింఘా దక్కించుకున్నారు. జైపూర్ లో జరిగిన 'మిస్ యూనివర్స్ ఇండియా 2024' పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. 2015లో మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న ఊర్వశీ రౌతేలా ఈ కార్యక్రమంలో న్యాయనిర్ణేతగా పాల్గొన్నారు. రియా విజయంపై ఊర్వశీ సంతోషం వ్యక్తం చేస్తూ, ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
51మంది ఫైనలిస్టులతో పోటీ పడి..
ఈ సందర్భంగా రియా మాట్లాడుతూ.. "మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని గెలుచుకోవడం నా జీవితంలో మరపురాని రోజు.ఈ పోటీల్లో పాల్గొనడం కోసం చాలా కష్టపడ్డాను. ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఉన్న కృషి ఎంతో ఉందని" పేర్కొన్నారు. ఆమె గతంలో గెలిచినవారిని తనకు స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఊర్వశీ మీడియాతో మాట్లాడుతూ,"రియా గ్లోబల్ మిస్ యూనివర్స్ 2024లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది.ఆమె ఆ పోటీల్లోనూ విజయం సాధించాలని ఆశిస్తున్నాను.ఈ పోటీల్లో పాల్గొన్న అమ్మాయిలు అందరూ చాలా కష్టపడ్డారు,వారి అంకితభావం ఎంతో ప్రభావవంతంగా ఉంది" అని అన్నారు. గుజరాత్‌కు చెందిన రియాసింఘా 18 ఏళ్ల వయసులోనే 51మంది ఫైనలిస్టులతో పోటీ పడుతూ ఈ కిరీటాన్ని సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు.