Page Loader
Manipur violence: మణిపూర్‌ను మళ్లీ కుదిపేసిన అల్లర్లు.. ఆ జిల్లాలో కర్ఫ్యూ!
మణిపూర్‌ను మళ్లీ కుదిపేసిన అల్లర్లు.. ఆ జిల్లాలో కర్ఫ్యూ!

Manipur violence: మణిపూర్‌ను మళ్లీ కుదిపేసిన అల్లర్లు.. ఆ జిల్లాలో కర్ఫ్యూ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2025
03:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్‌లో శనివారం రాత్రి మరోసారి హింస చెలరేగింది. అనేక జిల్లాల్లో ఉద్రిక్తతలు తలెత్తడంతో ప్రభుత్వం అత్యవసర చర్యలకు పాల్పడింది. బిష్ణుపూర్ జిల్లాలో కర్ఫ్యూ విధించగా, ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ఈ అల్లర్లు అరంబై టెంగోల్ అనే మెయిటీ సంఘం నాయకుడితో పాటు ఇతర నేతలను పోలీసులు అరెస్టు చేసిన తరువాత తలెత్తాయి. ఈ అరెస్టులపై నిరసనగా ప్రజలు రోడ్డెక్కారు. బస్సులు, వాహనాలకు నిప్పు పెట్టి, ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో శాంతియుత నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఇంకా తీవ్రతను పెంచుతూ, నిరసనకారులు తమపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించామని చెబుతూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకొచ్చాయి.

Details

టియర్ గ్యాస్ ప్రయోగించిన భద్రతా బలగాలు

అందులో పలువురు నిరసనకారులు ఒంటిపై పెట్రోల్ పోస్తూ కనిపించారు. ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాల్లో కూడా ఈ పరిస్థితులు వేగంగా వ్యాపించాయి. ఇంఫాల్‌లోని ఖురాయ్ లామ్‌లాంగ్ ప్రాంతంలో నిరసనకారులు బస్సులను తగలబెట్టారు. టైర్లు తగలబెట్టి రోడ్లను దిగ్బంధించారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారికి అడ్డుగా నిలిచినప్పుడు, ఘర్షణలు చెలరేగాయి. ఇంతటితో ఆగకుండా, నిరసనకారులు ఇంఫాల్ విమానాశ్రయానికి చేరుకుని తులిహాల్ గేటు వద్ద గుమిగూడారు. విమానాశ్రయ రోడ్డును దిగ్బంధించి రాత్రంతా అక్కడే బస చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో భద్రతా బలగాలు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాయి. లాఠీఛార్జ్‌లో ఒకరు మృతిచెందినట్టు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో మణిపూర్‌లో శాంతి నెలకొల్పడం ప్రభుత్వానికి గట్టి సవాలుగా మారింది.