
Bihar: బిహార్ లో ఎన్నికల వేళ ఆర్జేడీ నేత దారుణ హత్య
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ రాష్ట్రంలో ఆర్జేడీ (RJD) పార్టీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాజ్‌కుమార్ రాయ్ లేదా అల్లా రాయ్ అనే ప్రముఖ నేతను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. పోలీసుల వివరాల ప్రకారం, ఈ ఘటన చిత్రగుప్త ప్రాంతంలోని మున్నాచక్ ప్రాంతంలో చోటుచేసుకుంది. రాఘోపూర్ నియోజకవర్గం నుంచి పార్టీ తరఫున పోటీ చేసేందుకు రాయ్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి రాయ్‌పై అతిసమీపం నుంచి కాల్పులు జరిపారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు.
వివరాలు
రాజ్‌కుమార్ రాయ్‌కు రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలు
ఈ సమాచారం అందగానే పోలీస్ బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. .రాయ్‌ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సంఘటన చోటుచేసుకున్న ప్రాంతంలో ఆరు బుల్లెట్ షెల్స్ లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, సమీపంలోని సీసీటీవీ కెమెరాల ద్వారా సంఘటన వివరాలను సేకరిస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం, భూమి సంబంధ వివాదమే హత్యకు ప్రధాన కారణంగా భావించబడుతోంది. రాజ్‌కుమార్ రాయ్‌కు రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారాలు ఉన్నాయని తెలుస్తోంది. కాగా.. మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ హత్య తీవ్ర దుమారం రేపుతోంది.