LOADING...
Sanchar Saathi : సంచార్ సాథీ యాప్‌.. భగ్గుమన్న విపక్షాలు
సంచార్ సాథీ యాప్‌.. భగ్గుమన్న విపక్షాలు

Sanchar Saathi : సంచార్ సాథీ యాప్‌.. భగ్గుమన్న విపక్షాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 02, 2025
12:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో తయారయ్యే మొబైళ్లయినా, విదేశాల నుంచి దిగుమతి అయ్యే హ్యాండ్‌సెట్లయినా అన్నింటిలోను 'సంచార్ సాథీ' యాప్‌ను తప్పనిసరిగా ముందే ఇన్‌స్టాల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం మొబైల్ తయారీ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారులు తొలగించలేని విధంగా ఈ యాప్‌ను డీఫాల్ట్‌గా ఏర్పాటు చేయాలని సూచించింది. దీనిని అమలు చేయడానికి 90 రోజుల గడువును కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మొబైల్ వినియోగదారులను పెరుగుతున్న సైబర్ మోసాల నుంచి రక్షించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశం అని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు కేంద్ర చర్యను రాజ్యాంగ విరుద్ధమైనదిగా విమర్శించారు.

వివరాలు 

వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌లు, ఫోన్ కాల్స్ ద్వారా అనేక రకాల మోసాలు

ప్రజలపై నిఘా పెట్టేందుకే ప్రభుత్వం ఈ నిబంధనను తీసుకొచ్చిందని ఆరోపించారు. ఇది భారత రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగిస్తుందని పేర్కొంటూ, వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు గణనీయంగా పెరిగిపోయాయని, మోసగాళ్లు ఫిషింగ్ మెయిల్స్, అనుమానాస్పద మెసేజులు, హానికరమైన ఏపీకే ఫైళ్లను పంపిస్తూ అమాయకుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌లు, ఫోన్ కాల్స్ ద్వారా అనేక రకాల మోసాలు జరుగుతున్నాయని చెప్పాయి. ప్రత్యేకంగా స్పామ్ కాల్స్, మెసేజ్‌లతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశాయి.

వివరాలు 

సైబర్ నేరాల నియంత్రణకు అవకాశం

ఈ తరహా ఘటనలను అరికట్టడానికే 'సంచార్ సాథీ' యాప్‌ను తీసుకొచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. మొబైల్ ఫోన్లలో ఈ యాప్‌ను డీఫాల్ట్‌గా ఇన్‌స్టాల్ చేయడం వల్ల సైబర్ నేరాల నియంత్రణకు అవకాశం ఉంటుందని కేంద్రం అభిప్రాయపడింది. అందుకే మొబైల్ కంపెనీలకు ఈ యాప్‌ను తప్పనిసరిగా అమర్చాలని మార్గదర్శకాలు జారీ చేసినట్లు వివరించింది. అయితే, ఈ అంశంపై కేంద్రం జారీ చేసిన ఆదేశాలకు సంబంధించి మొబైల్ తయారీ సంస్థలు ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

Advertisement