LOADING...
Bengaluru: జైల్లో రౌడీషీటర్ పుట్టినరోజు వేడుకలు.. సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్
జైల్లో రౌడీషీటర్ పుట్టినరోజు వేడుకలు.. సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్

Bengaluru: జైల్లో రౌడీషీటర్ పుట్టినరోజు వేడుకలు.. సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 06, 2025
03:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థల మధ్య సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ హత్య కేసులో ఖైదు అనుభవిస్తున్న రౌడీషీటర్ శ్రీనివాస అలియాస్‌ గుబ్బచ్చి సినా జైల్లోనే గ్రాండ్‌గా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. సాధారణంగా జైల్లో ఇలాంటి వేడుకలకు అనుమతి ఉండదన్నది తెలిసిందే. అయినప్పటికీ ఖైదీలు కలిసి అతని బర్త్‌డేను ఘనంగా నిర్వహించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. జైల్లో సహచర ఖైదీలు సినాకు యాపిల్‌ కాయలతో చేసిన దండను మెడలో వేసి, ఈలలు, కేరింతలతో సంబరాలు జరిపారు. అనంతరం పెద్ద కత్తితో కేక్‌ కట్‌ చేసిన దృశ్యాలు మొబైల్‌లో రికార్డ్ అయ్యాయి. ఆవీడియోలు ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌, వంటి సోషల్‌ మీడియా వేదికల్లో వైరల్‌గా మారాయి.

Details

ఈ ఘటనపై దర్యాప్తు బృందం ఏర్పాటు

ఈ వీడియోను ప్రత్యర్థి భార్య సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసినట్లు సమాచారం. దీంతో జైలు శాఖ, పోలీసు శాఖలు అప్రమత్తమయ్యాయి. వాస్తవానికి ఖైదీలకు మొబైల్‌ ఫోన్లు లేదా వేడుకలకు అనుమతి ఉండదు. అయినప్పటికీ జైల్లో ఇలా జరుగడం అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. అంతేకాకుండా ఈ వేడుకలు 4-5 నెలల క్రితమే జరిగినప్పటికీ వీడియోలు తాజాగా బయటకు రావడంతో మరింత కలకలం రేపాయి. ఈ సంఘటనపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. గతంలో అభిమానిని హత్య చేసిన కేసులో జైల్లో ఉన్న నటుడు దర్శన్‌ కూడా ఇలాంటివే సౌకర్యాలు పొందినట్లు గుర్తుచేస్తున్నారు.

Details

విచారణకు అదేశించిన ప్రభుత్వం

అప్పుడు దర్శన్‌ వీడియో కాల్‌ ద్వారా బంధువులతో మాట్లాడిన దృశ్యాలు బయటకు రావడం పెద్ద సంచలనం సృష్టించగా, ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తాజాగా బయటకు వచ్చిన గుబ్బచ్చి సినా పుట్టినరోజు వేడుకల వీడియోపై శనివారం పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. రౌడీషీటర్ చేతిలో హత్యకు గురైన బాధితురాలి భార్యే ఈ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.