Loading...
Tirupati: తిరుపతి జిల్లాలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ప్లాంట్‌కు 'సియా' పర్యావరణ అనుమతులు
తిరుపతి జిల్లాలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ప్లాంట్‌కు 'సియా' పర్యావరణ అనుమతులు

Tirupati: తిరుపతి జిల్లాలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ప్లాంట్‌కు 'సియా' పర్యావరణ అనుమతులు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2026
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేయనున్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వాహనాల తయారీ ప్లాంట్‌కు కీలకమైన పర్యావరణ అనుమతులు లభించాయి. సత్యవేడు మండలంలోని వానెల్లూరు, రాళ్లకుప్పం ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్‌కు రాష్ట్ర పర్యావరణ ప్రభావ మదింపు ప్రాధికార సంస్థ (ఎస్‌ఈఐఏఏ-సియా) అక్టోబరు 1న అనుమతులు మంజూరు చేసింది. తొలి దశలో 90.84 ఎకరాల్లో ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు రూ.1,249 కోట్ల పెట్టుబడితో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మాతృ సంస్థ ఐషర్‌ మోటార్స్‌ దరఖాస్తు చేసింది. పర్యావరణ అనుమతుల కోసం సుమారు రెండు నెలల క్రితం ఈ ప్రతిపాదనను సమర్పించింది. సియా నుంచి అనుమతులు రావడంతో తదుపరి దశలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) నుంచి కన్సెంట్‌ ఫర్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (సీఎఫ్‌ఏ) పొందాల్సి ఉంది.

వివరాలు 

గ్రీన్‌బెల్ట్‌గా ప్రాజెక్టు పరిధిలో 25.27 శాతం ప్రాంతం 

ప్లాంట్‌కు అవసరమైన వివిధ అనుమతులు సింగిల్‌ విండో విధానంలో తక్కువ వ్యవధిలోనే పూర్తయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు సంస్థకు అవసరమైన మొత్తం 267 ఎకరాల భూమిని నవంబరు నెలాఖరు నాటికి అప్పగించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.

తొలి దశలో 1.49 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో బిల్ట్‌అప్‌ ఏరియాతో తయారీ ప్లాంట్‌ను అభివృద్ధి చేయనున్నారు.

ప్రాజెక్టు పరిధిలో 25.27 శాతం ప్రాంతాన్ని గ్రీన్‌బెల్ట్‌గా ఉంచాలని అధికారులు నిర్దేశించారు.

అలాగే పరిశ్రమలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.

వివరాలు 

15 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తొలి దశలో ఏడాదికి 4.50 లక్షల మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

2028-29 నాటికి మొదటి దశ నిర్మాణ పనులను పూర్తి చేసి ఉత్పత్తి కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లాలని సంస్థ భావిస్తోంది.

ఈ ప్లాంట్‌ ఏర్పాటుతో తిరుపతి జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.

ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 15 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.

ADVERTISEMENT