Page Loader
Regional Ring Road: రీజినల్ రింగ్ రోడ్డుకి 72.35 హెక్టార్ల అప్పగింతకు కేంద్రం ఆమోదం
రీజినల్ రింగ్ రోడ్డుకి 72.35 హెక్టార్ల అప్పగింతకు కేంద్రం ఆమోదం

Regional Ring Road: రీజినల్ రింగ్ రోడ్డుకి 72.35 హెక్టార్ల అప్పగింతకు కేంద్రం ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 04, 2024
08:18 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రాంతీయ వలయ రహదారి (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర అటవీ శాఖ అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ కైలాష్‌ భీంరావు భవర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక లేఖను పంపించారు. రీజినల్‌ ఎంపవర్డ్‌ కమిటీ (ఆర్‌ఈసీ) అనుమతులను జారీ చేయడంతో ఈ ప్రాజెక్టు త్వరగా ముందుకు సాగనుంది. ఈ అనుమతుల కింద, మెదక్‌ జిల్లాలో 35.5882 హెక్టార్లు, సిద్దిపేట జిల్లాలో 28.2544 హెక్టార్లు, యాద్రాద్రి జిల్లాలో 8.511 హెక్టార్ల అటవీ భూమిని ప్రాజెక్టు కోసం ఉపయోగించేందుకు అనుమతులు ఇచ్చారు. ఈ భూములను భారత్‌మాల పరియోజన ఫేజ్‌-1 కింద పీఐయూ (ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్‌ యూనిట్‌), గజ్వేల్‌ పేరుతో గుర్తించారు.

వివరాలు 

డీపీఆర్‌ ఇప్పటికే సమర్పణ 

అటవీ అనుమతులు వచ్చిన తర్వాత, ఎన్‌హెచ్‌ఏఐ నుంచి టెక్నికల్‌ అప్రూవల్‌ వచ్చేలా మార్గం సుగమమవుతోంది. డిసెంబరు లేదా జనవరిలో టెండర్ల ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం 161 కిలోమీటర్ల మేర సంగారెడ్డి, తూప్రాన్‌, గజ్వేల్‌, యాదాద్రి, చౌటుప్పల్‌ ప్రాంతాల మీదుగా నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టును ఆరు ప్యాకేజీలుగా విభజించారు. మొత్తం 1,940 హెక్టార్ల భూమి అవసరం కాగా, ఇందులో 72.35 హెక్టార్లు అటవీ భూమిగా గుర్తించారు. ఈ భూముల వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం జులై 26న కేంద్రానికి అభ్యర్థన పంపింది, దీనిపై కేంద్రం అంగీకారం తెలిపింది.

వివరాలు 

త్వరలో టెండర్లు 

ప్రాజెక్టు సమర్పణలో భాగంగా, ఎన్‌హెచ్‌ఏఐకు ఇప్పటికే డీపీఆర్‌ (డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టు) సమర్పించారు. ఇందులో ఇంటర్‌ఛేంజ్‌లు, వంతెనలు, అండర్‌పాసులు, కల్వర్టుల నిర్మాణానికి సంబంధించిన వివరాలను పొందుపరిచారు. ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి అనుమతులు రావడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ అనుమతులను మంజూరు చేసిన కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ 90 శాతం పూర్తయిందని, త్వరలోనే టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టు పూర్తి కాగానే ఉత్తర తెలంగాణకు మెరుగైన రవాణా సౌకర్యం లభించడమే కాకుండా ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదపడుతుందని అంచనా.