Horticulture Hub: రాయలసీమలో రూ.లక్ష కోట్ల ఉద్యాన హబ్.. 5,869 గ్రామాల్లో భారీ ప్రణాళిక
ఈ వార్తాకథనం ఏంటి
రాయలసీమతోపాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉద్యాన రంగాన్ని మరింత విస్తరించేందుకు భారీ ప్రణాళిక సిద్ధమైంది. సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడితో ఉద్యాన హబ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పది జిల్లాల్లోని 201 క్లస్టర్ల పరిధిలో సమీకృత ఉద్యానాభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఈ నెలాఖరులో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. మూడు దశల్లో 5,869 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. క్లస్టర్లలో అభివృద్ధి పనులను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించనున్నారు.
వివరాలు
మూడు దశల్లో అభివృద్ధి
ఉద్యాన హబ్ ఏర్పాటును మూడు దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తొలిదశలో ఇప్పటికే సాగునీటి సదుపాయం, రవాణా, ఇతర అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉన్న క్లస్టర్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఆ తర్వాత రెండో, మూడో దశల్లో మిగిలిన క్లస్టర్లను అభివృద్ధి చేస్తారు.
ఫేజ్-1లో ప్రస్తుతం ఉద్యాన పంటలు సాగవుతున్న 8,86,991 హెక్టార్లతోపాటు మరో 1,63,451 హెక్టార్లలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
ఫేజ్-2లో 2,28,171 హెక్టార్లు, ఫేజ్-3లో 2,10,547 హెక్టార్లను ఉద్యాన హబ్ పరిధిలోకి తీసుకురానున్నారు.
ఆయా ప్రాంతాల్లో పంటల విస్తరణతోపాటు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా కల్పించనున్నారు.
వివరాలు
రూ.లక్ష కోట్ల పెట్టుబడి
ఉద్యాన హబ్ కోసం మొత్తం పెట్టుబడి సుమారు రూ.లక్ష కోట్లు ఉండనుంది.
ఇందులో ప్రభుత్వ వాటా దాదాపు రూ.40 వేల కోట్లు కాగా, ప్రైవేట్ రంగం నుంచి మరో రూ.60 వేల కోట్ల పెట్టుబడులను సమీకరించనున్నారు.
ప్రభుత్వ పెట్టుబడుల్లో ఉద్యానశాఖ రూ.14,906 కోట్లు, జలవనరులశాఖ రూ.20,884 కోట్లు, పంచాయతీరాజ్‌శాఖ రూ.4,562 కోట్లు కేటాయించనున్నాయి.
ఈ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10 వేల కోట్ల నిధులు సమకూరనున్నాయి.
అలాగే కేంద్ర ప్రభుత్వ హామీతో ప్రపంచ బ్యాంకు నుంచి రూ.30 వేల కోట్ల రుణాన్ని పొందే అవకాశం ఉంది.
ఉద్యానశాఖ ఆధ్వర్యంలో విత్తనాలు, ఎరువుల సరఫరా, సూక్ష్మసేద్యం, కోత అనంతర నిర్వహణ, ఆధునిక సాంకేతికత వినియోగం, రైతుల సామర్థ్యాన్ని పెంచే కార్యక్రమాలను చేపడతారు.
వివరాలు
పొలాలకు రహదారులు.. మార్కెట్లకు అనుసంధానం
ఉద్యాన సాగులో ఉత్పాదకతను పెంచడంతోపాటు పంటల నాణ్యత మెరుగుపడేలా చర్యలు తీసుకోనున్నారు.
జలవనరులశాఖ ద్వారా ఆయకట్టు స్థిరీకరణ, కొత్తగా ఆయకట్టు సృష్టించడం, ప్రధాన కాల్వలు, బ్రాంచి కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల అభివృద్ధి వంటి పనులు చేపడతారు.
అవసరమైన ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని అందించే ఏర్పాట్లు కూడా చేస్తారు.
పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో రైతుల పొలాల నుంచి మార్కెట్ల వరకు అనుసంధాన రహదారులను నిర్మించనున్నారు.
దీంతో పంటలను మార్కెట్లకు తరలించడం సులభతరం కావడంతోపాటు రవాణా వ్యయం తగ్గే అవకాశం ఉంటుంది.
వివరాలు
పొలాలకు రహదారులు.. మార్కెట్లకు అనుసంధానం
ప్రైవేట్ రంగం నుంచి వచ్చే రూ.60వేల కోట్ల పెట్టుబడులను ప్రధానంగా ఆహారశుద్ధి పరిశ్రమలు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టుల ఏర్పాటుకు వినియోగించనున్నారు.
పంటల ఉత్పత్తి నుంచి శుద్ధి,నిల్వ, మార్కెటింగ్ వరకు సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేయడమే ఈ ప్రణాళిక లక్ష్యంగా ఉంది.
ఒక్కో క్లస్టర్‌లో 5 నుంచి 10వేల హెక్టార్లలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించనున్నారు.
ఆయా ప్రాంతాలకు అనుకూలమైన పంటలను విస్తరించేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టనుంది.
మామిడి,బత్తాయి,నిమ్మ,దానిమ్మ,జామ,అరటి,బొప్పాయి వంటి పంటలతోపాటు ఆపిల్, అవకాడో, అంజూర, మిరియాలు తదితర ఉద్యాన పంటల సాగును కూడా ప్రోత్సహించనున్నారు.
మొత్తంగా సాగు, నీరు, రహదారులు, మార్కెట్లు, ఆహారశుద్ధి పరిశ్రమలను ఒకే వ్యవస్థలో అనుసంధానించి ఉద్యాన రంగాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.