Ram Mandir Donation: రూ.3,500 కోట్ల విరాళాలు.. రామమందిర విరాళాల లెక్కల్లో గందరగోళం.. 2020లోనే ఆడిట్ హెచ్చరిక!
ఈ వార్తాకథనం ఏంటి
అయోధ్యలోని రామమందిర నిర్మాణం కోసం ఏర్పాటైన శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో విరాళాల నిర్వహణపై 2020లోనే తీవ్రమైన లోపాలను ఒక ప్రైవేట్ ఆడిట్ సంస్థ గుర్తించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ట్రస్ట్ ఏర్పడిన కొద్ది నెలలకే నిర్వహించిన ఆడిట్‌లో విరాళాల రికార్డుల నిర్వహణలో వ్యవస్థీకృత విధానం లేదని,నిర్వహణ స్థాయిలో బాధ్యతల కేటాయింపు స్పష్టంగా లేదని సంస్థ పేర్కొంది. ఆడిట్ నివేదికలో ట్రస్ట్ కార్యకలాపాల కోసం ప్రతి లావాదేవీ,డేటా నిర్వహణ,సిబ్బంది బాధ్యతలు, వనరుల వినియోగానికి సంబంధించి స్పష్టమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) రూపొందించాలని సిఫారసు చేసింది. అయితే ఆ సూచన ఇప్పటివరకు అమలు కాలేదని తెలుస్తోంది.
వివరాలు
అందుబాటులో లేని వ్యవస్థీకృత రికార్డులు
ఇదే సమయంలో రామమందిరంలో భక్తులు సమర్పించిన నగదు,బంగారు ఆభరణాల లెక్కల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెలువడటంతో ఈ నివేదికకు ప్రాధాన్యం పెరిగింది. నవంబర్ 2020లో సమర్పించిన ఆడిట్ నివేదికలో విరాళాల ఆర్థిక లెక్కల కోసం అవసరమైన వ్యవస్థీకృత రికార్డులు అందుబాటులో లేవని పేర్కొంది. అమలు స్థాయిలో ఉన్న నిర్వహణ వ్యవస్థ స్పష్టత లేకుండా అత్యంత వృత్తిపరమైన ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సమాచార నియంత్రణ, పారదర్శకతను నిర్ధారించడం కష్టమవుతుందని హెచ్చరించింది.
వివరాలు
సరైన ఎస్‌వోపీ అమలు చేస్తే..
ట్రస్ట్ వర్గాల సమాచారం ప్రకారం, 2020లోనే ట్రస్ట్ ఉన్నతాధికారి ఒకరు ఆడిట్ సంస్థను అంతర్గత ఆడిట్, రిస్క్ మేనేజ్‌మెంట్ అంశాలపై సలహాలు ఇవ్వాలని కోరారు. దీంతో సంస్థ నిధుల నిర్వహణ, డేటా నిర్వహణ విధానాలను పరిశీలించి అనేక లోపాలను గుర్తించింది. సరైన ఎస్‌వోపీ అమలు చేస్తే అన్ని స్థాయిల్లో క్రమబద్ధమైన పని సంస్కృతి ఏర్పడుతుందని నివేదికలో పేర్కొంది. విరాళాల నమోదు, డేటా ఎంట్రీ ప్రక్రియల్లో రెండో, మూడో స్థాయి తనిఖీలు లేకపోవడం కూడా ఆడిట్ సంస్థ ప్రధానంగా ప్రస్తావించింది. బాధ్యతలను స్పష్టంగా కేటాయించే సంస్థాగత నిర్మాణం అవసరమని సూచించింది. లావాదేవీలకు సంబంధించిన విభాగాల మధ్య సమన్వయం లేకపోతే డేటా సమగ్రత దెబ్బతింటుందని హెచ్చరించింది.
వివరాలు
విరాళాలకు ప్రత్యేక స్టాక్ రిజిస్టర్
ఇటీవల రామమందిరానికి భక్తులు సమర్పించిన నగదు,ఆభరణాల్లో కొంత భాగానికి సరైన లెక్కలు లేవన్న ఆరోపణలు రావడంతో ట్రస్ట్ నిర్వహణపై విమర్శలు పెరిగాయి. ఆడిట్ సంస్థ సూచించిన చర్యలను అప్పుడే అమలు చేసి ఉంటే ప్రస్తుత పరిస్థితి తలెత్తేది కాదని ట్రస్ట్‌కు సంబంధించిన వర్గాలు పేర్కొంటున్నాయి. ఆభరణాలు వంటి వస్తు రూపంలో వచ్చే విరాళాలకు ప్రత్యేక స్టాక్ రిజిస్టర్ నిర్వహించాలని కూడా ఆడిట్ సంస్థ సూచించింది. అయితే అలాంటి వ్యవస్థలు పూర్తిస్థాయిలో అమలయ్యాయా అనే అంశంపై స్పష్టత లేదు. వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నప్పటికీ ట్రస్ట్‌లో సమర్థవంతమైన మానవ వనరుల (HR) విభాగం లేకపోవడాన్ని కూడా ఆడిట్ సంస్థ ప్రశ్నించింది.
వివరాలు
డేటా భద్రత అంశంపైనా ఆడిట్ నివేదిక ఆందోళన
బ్యాంకు ఖాతాలను సరిచూడటం,అకౌంటింగ్ డేటా ఎంట్రీ,మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(MIS) నిర్వహణ కోసం అర్హత కలిగిన సిబ్బంది అవసరమని సూచించింది. డేటా భద్రత అంశంపైనా ఆడిట్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.ట్రస్ట్‌కు సేవలు అందిస్తున్న ఐటీ సంస్థ వద్ద డేటా భద్రత,సర్వర్ నిర్వహణ,డేటా చోరీ ప్రమాదాల నివారణకు సంబంధించిన సరైన ఆధారాలు కనిపించలేదని పేర్కొంది. డేటా ఎంట్రీలు,డేటాబేస్ నిర్వహణపై అంతర్గత నియంత్రణ వ్యవస్థలు కూడా లేవని వెల్లడించింది. ఐటీ సేవల సంస్థతో ట్రస్ట్ మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా అర్హత కలిగిన సిబ్బందిని నియమించాలని ఆడిట్ సంస్థ సిఫారసు చేసింది. సరైన విధానాలు, నియంత్రణలు లేకపోతే డేటా భద్రతకు ముప్పు ఏర్పడటంతో పాటు తప్పుడు లావాదేవీలు, డేటా ఎంట్రీల ప్రమాదం కూడా పెరుగుతుందని హెచ్చరించింది.