Mahalaxmi Scheme: తెలంగాణలో రేపటి నుంచి రూ.500 గ్యాస్ సిలిండర్లు
మహాలక్ష్మి పథకం కింద మంగళవారం నుంచి రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకానికి సాధారణ వినియోగదారులతో పాటు ఉజ్వల పథకం లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈ పథకం లబ్ధిదారులు ముందుగా గ్యాస్ మొత్తం ఖర్చును చెల్లించాలని, ఆ తర్వాతే ప్రభుత్వం వారికి తిరిగి చెల్లిస్తుందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం రూ.40 సబ్సిడీ ఇస్తోంది. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుంది. మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ ధర రూ.500, కేంద్ర సబ్సిడీ రూ.40, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖాతాదారుల ఖాతాలో జమ చేస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఒక్కో సిలిండర్‌పై రూ.340 సబ్సిడీ
ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన వారికి కూడా అదే విధంగా రీయింబర్స్‌మెంట్ ఇస్తామని వివరించారు. రాష్ట్రంలో 11.58 లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉండగా కేంద్రం ఒక్కో సిలిండర్‌పై రూ.340 సబ్సిడీ ఇస్తోంది. ఈ మొత్తానికి అదనంగా గ్యాస్ ధర రూ.500 మినహా మిగిలిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఖాతాదారుడి ఖాతాలో జమ చేస్తుంది. ఉదాహరణకు,హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.970 అయితే,ఉజ్వల పథకం సబ్సిడీ రూ.340, మహాలక్ష్మి పథకం ధర రూ.500, మిగిలిన మొత్తం రూ.130 రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. కాగా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)తో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు సమావేశమై మహాలక్ష్మి పథకం అమలుపై చర్చించారు. సోమవారం లబ్ధిదారుల జాబితాను అందించేందుకు ఏర్పాట్లు చేశారు.