RTC bus Reservation: గూగుల్ మ్యాప్స్‌లోనే ఆర్టీసీ టికెట్ల బుకింగ్.. త్వరలో ప్రయాణికుల కోసం కొత్త సదుపాయం
ఈ వార్తాకథనం ఏంటి
బస్సు టికెట్ల రిజర్వేషన్,ఛార్జీల చెల్లింపులను మరింత సులభతరం చేయడానికి ఆర్టీసీ యాజమాన్యం కొత్త చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం ప్రయాణికులు ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా బస్టాండ్లలోని కౌంటర్లలోనే టికెట్లు బుక్ చేసుకోవాల్సి వస్తోంది. కానీ త్వరలో గూగుల్ మ్యాప్స్ ద్వారానే బస్సు వివరాలను తెలుసుకోవడంతోపాటు,అదే సమయంలో టికెట్లను రిజర్వు చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఈ సదుపాయం ప్రారంభమైన తర్వాత మొబైల్ ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ తెరిచి, గమ్యస్థానాన్ని నమోదు చేస్తే సరిపోతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో ఎంచుకున్న తర్వాత చెల్లింపులు పూర్తి చేస్తే వెంటనే రిజర్వేషన్ ధృవీకరణ పొందవచ్చు. ఈ-టికెట్ నేరుగా ప్రయాణికుడి మొబైల్ ఫోన్‌కు వస్తుంది.
వివరాలు
గూగుల్‌కు బస్సు సమాచార జాబితా సిద్ధం
రిజర్వేషన్ ఉన్న బస్సులకే కాకుండా, సాధారణ (నాన్-రిజర్వేషన్) బస్సుల్లోనూ ఇదే విధంగా టికెట్లు కొనుగోలు చేసి ప్రయాణించే అవకాశం కల్పించడానికి ఆర్టీసీ ప్రయత్నిస్తోంది. తెలంగాణ పరిధిలో నడుస్తున్న బస్సులు, అంతర్రాష్ట్ర సర్వీసుల వివరాలను గూగుల్‌కు అందించేందుకు ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే జాబితా సిద్ధం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడిచే సిటీ బస్సుల సమాచారం కొద్దిరోజుల క్రితం ఐటీ శాఖ ద్వారా గూగుల్‌కు అందించబడినట్లు ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్‌లో ఈ వివరాలపై టెస్టింగ్ దశ కొనసాగుతోంది. మరో రెండు మూడు వారాల్లో ఈ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. మొదటగా హైదరాబాద్ నగర బస్సుల సమాచారంతో ప్రారంభించి,అనంతరం జిల్లా బస్సుల వివరాలనూ జోడించనున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.
వివరాలు
కార్డ్ టచ్‌తోనే టికెట్ జారీ
ప్రస్తుతం బస్సులో ఎక్కిన తర్వాత క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో చెల్లింపులు చేసి టికెట్ తీసుకునే సౌకర్యం ఉంది. కానీ ఈ విధానంలో పిన్ నంబరు నమోదు చేయాల్సి ఉండడం వల్ల ఎక్కువ సమయం పడుతోంది. ముఖ్యంగా సిటీ బస్సులు లేదా లాంగ్ రూట్ బస్సుల్లో ప్రయాణికులు ఎక్కువగా ఉన్నప్పుడు టికెట్ జారీకి ఇబ్బంది కలుగుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని,పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా,కార్డును టికెట్ ఇష్యూ యంత్రం (టిమ్)పై తాకగానే చెల్లింపు జరిగి టికెట్ జారీ అయ్యే విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది.
వివరాలు
వారం లోపలే అమల్లోకి..
ఈ కొత్త సిస్టమ్‌ను వచ్చే వారం లోపలే అమల్లోకి తేవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రారంభ దశలో హైదరాబాద్ నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే ఏసీ బస్సుల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టి, తర్వాత సిటీ బస్సులు, దూరప్రాంత సర్వీసుల్లో కూడా అమలు చేయనున్నట్లు సమాచారం.