RTC: 22 నుంచి ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వ జోక్యం కోరిన సంఘాలు
ఈ వార్తాకథనం ఏంటి
తాము ప్రకటించిన సమ్మెకు అన్నిఆర్టీసీ సంఘాలతో పాటు ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలియజేశాయని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ వెంకన్న వెల్లడించారు. సమ్మె నోటీసు ఇచ్చి ఇప్పటికే 41 రోజులు గడిచినా ప్రభుత్వం,యాజమాన్యం ఇప్పటివరకు చర్చలకు ముందుకు రాకపోవడం బాధాకరమని అన్నారు. ఈ నెల 22 నుంచి చేపట్టనున్న సమ్మెపై జేఏసీ నాయకులు మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమ్మె అంశంలో జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభం కాలేదని,కేవలం కాలయాపన కోసం మాత్రమే విలీన కమిటీని ఏర్పాటు చేశారని ఆరోపించారు. నష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ఆర్టీసీ విషయంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
వివరాలు
ఆర్టీసీ సమ్మె.. మరో సకల జనుల సమ్మెగా మారే అవకాశం
ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందని చెబుతున్న ప్రభుత్వం, మూసీ అభివృద్ధి పనులను ఎలా చేపడుతోందని ప్రశ్నించారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ వారికి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌లో ఆర్టీసీ ఉనికిని తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నారని, ఆర్టీసీకి చెందిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించే యత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కూడా సమ్మెలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మె కేవలం ఆర్టీసీ కార్మికులకే పరిమితం కాకుండా, సమాజంలోని అన్ని వర్గాల మద్దతుతో మరో సకల జనుల సమ్మెగా మారే అవకాశం ఉందని జేఏసీ ఛైర్మన్ వెంకన్న హెచ్చరించారు.