LOADING...
S-400: భారత వైమానిక రక్షణకు భారీ బూస్ట్: అదనంగా 3 S-400లను ఇచ్చేందుకు రష్యా సిద్ధం
అదనంగా 3 S-400లను ఇవ్వేందుకు రష్యా సిద్ధం

S-400: భారత వైమానిక రక్షణకు భారీ బూస్ట్: అదనంగా 3 S-400లను ఇచ్చేందుకు రష్యా సిద్ధం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 21, 2025
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత వైమానిక రక్షణ వ్యవస్థ రాబోయే కాలంలో మరింత శక్తివంతం కానుందనే సూచనలు కనిపిస్తున్నాయి. భారత వైమానిక దళానికి అదనంగా మరో రెండు నుంచి మూడు S-400 వ్యవస్థలను అందించడానికి రష్యా ముందుకు వస్తోందన్న వార్తలు వెలువడ్డాయి. మే 2025లో జరిగిన ఆపరేషన్ సిందూర్లో పాకిస్థాన్ యుద్ధ విమానాలు, క్షిపణులను సమర్థవంతంగా అడ్డుకొని S-400 తన సామర్ధ్యాన్ని చాటుకున్న తర్వాత ఈ ప్రతిపాదన వచ్చిందని తెలుస్తోంది. రష్యా ప్రభుత్వ యాజమాన్య సంస్థ రోస్టెక్ ఇప్పటికే భారతదేశంతో ఈ కొత్త ఒప్పందంపై ప్రారంభ చర్చలు జరిపినట్టు సమాచారం. ఈసారి సరఫరాలు నిర్దేశించిన సమయానికే జరిగేలా చర్యలు తీసుకుంటామని, గతంలో ఎదురైన ఆలస్యాలు పునరావృతం కాకుండా చూస్తామని రష్యా హామీ ఇచ్చింది.

వివరాలు 

నిలిచిపోయిన ఐదవ రెజిమెంట్ల డెలివరీలు

2018లో భారత్ ఐదు S-400 రెజిమెంట్లను సుమారు $5.43 బిలియన్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఆ ఐదు రెజిమెంట్లలో మూడు 2023 నాటికే భారత్‌కి చేరాయి. అయితే ఉక్రెయిన్‌ యుద్ధ పరిణామాల వల్ల నాల్గవ, ఐదవ రెజిమెంట్ల డెలివరీలు నిలిచిపోయి, అవి ఇప్పుడు 2026 ప్రారంభం నుంచి మధ్యవరకు వాయిదా పడ్డాయి. ఈ కారణంగా కొత్త కొనుగోలు ఒప్పందం చేసేముందు, ప్రస్తుత రెజిమెంట్ల డెలివరీ షెడ్యూల్‌ను పూర్తిగా ఖరారు చేయాలని భారత్ రష్యాకు స్పష్టం చేసింది.

వివరాలు 

పాకిస్తాన్‌పై 314 కి.మీ దూరపు ప్రిసిషన్ స్ట్రైక్

S-400ను భారత వైమానిక దళం ప్రతీకాత్మకంగా "సుదర్శన చక్రం"గా భావిస్తోంది. చైనా-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల వద్ద మోహరించిన ఈ వ్యవస్థ, భారత బహుళ-స్థాయి వైమానిక రక్షణలో కీలక భాగంగా నిలుస్తోంది. అదంపూర్ బేస్‌ నుంచి పని చేస్తున్న యూనిట్, 314 కి.మీ దూరంలో పాకిస్తాన్ విమానాన్ని కూల్చి ఒక రికార్డు నెలకొల్పింది. 300 కి.మీ పైబడి పరిధిలో ఆరు JF-17లు, ఒక ISR విమానాన్ని కూల్చినట్టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ధృవీకరించారు. S-400 బిగ్ బర్డ్ రాడార్" ఒకేసారి 300కు పైగా గగన లక్ష్యాలను గుర్తించి ట్రాక్ చేయగలిగింది.

వివరాలు 

50% సాంకేతిక బదిలీ (ToT)తో కూడిన 'మేక్ ఇన్ ఇండియా' భాగస్వామ్యం

వ్యవస్థను యుద్ధసిద్ధంగా మార్చేందుకు ఐదు నిమిషాల కన్నా తక్కువ సమయం పడుతుంది. ఈ పనితీరు గణాంకాలు S-400‌ను భారత వైమానిక రక్షణ వ్యవస్థలో కీలక స్తంభంగా నిలబెట్టాయి. కొత్త ఒప్పందంలో భాగంగా, 50% సాంకేతిక బదిలీ (ToT)తో కూడిన 'మేక్ ఇన్ ఇండియా' భాగస్వామ్యం కూడా ఇవ్వడానికి రష్యా అంగీకరించినట్టు సమాచారం. దీంతో BDL వంటి భారతీయ రక్షణ సంస్థలు S-400 క్షిపణుల అసెంబ్లీలో నేరుగా పాల్గొనే అవకాశం ఉంటుంది. 2025 అక్టోబరులో ఆమోదం పొందిన 48N6 క్షిపణి స్థానిక తయారీ మరింత వేగం అందుకోనుంది. ఈ మార్పులతో S-400 సపోర్ట్ వ్యవస్థలో సుమారు 50% వరకు స్వదేశీకరణ సాధ్యం అవుతుందని అంచనా.

వివరాలు 

ప్యాకేజ్ ఖర్చు సుమారు $23 బిలియన్లుగా అంచనా

దీన్ని ద్వారా ఖర్చులు తగ్గడమే కాక, విదేశీ ఆధారపడటం కూడా గణనీయంగా తగ్గుతుంది.ఇది భారత రక్షణ స్వావలంబనకు పెద్ద ఊతమివ్వనుంది. రష్యాతో జరుగుతున్న కొనసాగుతున్న చర్చలు సజావుగా జరిగితే,2026 మధ్య నాటికి ఒప్పందం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త రెజిమెంట్ల సరఫరాలు 2029-2030 మధ్య ప్రారంభమయ్యే వీలుంది.ఈ మొత్తం ప్యాకేజ్ ఖర్చు సుమారు $23 బిలియన్లుగా అంచనా వేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్‌లో S-400 కనబరిచిన విజయవంతమైన పనితీరు,దాని సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపడమే కాక భారత్-రష్యా రక్షణ సహకారానికి కొత్త దశను తెరిచింది. కొత్త ఒప్పందం అమల్లోకి వస్తే, భారత వైమానిక రక్షణ శక్తి మరింతగా పెరగటం ఖాయం.పొరుగు దేశాల నుంచి వచ్చే ఏ గగన ముప్పునైనా అడ్డుకునే శక్తి అనేక రెట్లు పెరుగుతుంది.