సచిన్ పైలెట్ 'జన్ సంఘర్ష్ యాత్ర'; అశోక్ గెహ్లాట్‌పై మరోసారి ఫైర్
అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు రాజస్థాన్ కాంగ్రెస్‌లో మళ్లీ కుమ్ములాట మొదలైనట్లు కనిపిస్తోంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అశోక్ గెహ్లాట్‌కు సోనియా గాంధీ నాయకురాలు కాదనీ, బీజేపీకి చెందిన వసుంధర రాజే అని సచిన్ పైలట్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కీలకమైన కర్ణాటక ఎన్నికలను ఎదుర్కోవడానికి ఒకరోజు ముందు తనసొంత పార్టీ ముఖ్యమంత్రిపై పైలెట్ ఆరోపణలు చేశారు. అంతేకుకాకుండా తాను పార్టీ మారే అవకాశం లేదని తేల్చి చెప్పారు. అలాగే రాష్ట్రంలో అవినీతిని ఎత్తిచూపేందుకు, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం అజ్మీర్ నుంచి జైపూర్ వరకు 'జన్ సంఘర్ష్ యాత్ర'ను చేపట్టనున్నట్లు పైలెట్ ప్రకటించారు.
అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యలకు పొంతన లేదు: సచిన్
2020లో కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి సచిన్ పైలట్ తిరుగుబాటు చేసినప్పుడు మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తన ప్రభుత్వాన్ని రక్షించడంలో సహాయపడ్డారని స్వయంగా అశోక్ గెహ్లాట్ గతవారం తన ప్రసంగంలో పేర్కొన్నట్లు సచిన్ పైలెట్ ఆరోపించారు. ధోల్‌పూర్‌లో ముఖ్యమంత్రి ప్రసంగం విన్న తర్వాత, ఆయన నాయకురాలు సోనియా గాంధీ కాదని, ఆయన నాయకురాలు వసుంధర రాజే అని తాను భావిస్తున్నట్లు పైలట్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. బీజేపీ తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించిందని అతను (గెహ్లాట్) ఆరోపించారని, ఆ తర్వాత ప్రభుత్వాన్ని కాపాడటానికి బీజేపీ నాయకులు రాజే సహాయం చేసినట్లు మళ్లీ అతనే చెప్పడం విడ్డూరంగా ఉందని స్పష్టం చేశారు.