LOADING...
Ayodhya: అయోధ్య రాముడికి బహుమతిగా ఒడిశా భక్తుల స్వర్ణ రామధనుస్సు
అయోధ్య రాముడికి బహుమతిగా ఒడిశా భక్తుల స్వర్ణ రామధనుస్సు

Ayodhya: అయోధ్య రాముడికి బహుమతిగా ఒడిశా భక్తుల స్వర్ణ రామధనుస్సు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2026
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడికి ఒడిశా భక్తులు అపూర్వమైన భక్తి కానుకను సిద్ధం చేశారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు రెండేళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని, సుమారు 286 కిలోల బరువున్న మహా స్వర్ణ ధనుస్సును అయోధ్యకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ విశేషమైన కళాఖండం ఒడిస్సా రాష్ట్రం రూర్కెలాలో అత్యంత నైపుణ్యంతో రూపొందించబడింది. ఈ భారీ ధనుస్సు తయారీకి ఖరీదైన లోహాలను వినియోగించారు. ఇందులో ఒక కిలో స్వచ్ఛమైన బంగారం, రెండున్నర కిలోల వెండి, అలాగే రాగి, జింక్, ఇనుము వంటి లోహాల మిశ్రమం ఉపయోగించారు. ఈ మహా రామధనుస్సు తయారీకి సుమారు కోటి 10 లక్షల రూపాయల వ్యయం అయినట్లు సమాచారం.

వివరాలు 

ఒడిస్సా ప్రజల అపారమైన భక్తికి నిలువెత్తు నిదర్శనం

సుమారు 8 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో రూపొందిన ఈ స్వర్ణ ధనుస్సు అత్యంత గంభీరంగా, కళాత్మకంగా దర్శనమిస్తుంది. పూరీ జగన్నాథ స్వామి,అయోధ్య శ్రీరాముడి మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని ప్రతిబింబించేలా, ఈ ధనుస్సుపై జగన్నాథ స్వామి ప్రతిమను, ప్రత్యేకంగా రూపొందించిన ఫిలిగ్రీ కిరీటాన్ని సున్నితమైన శిల్పకళతో చెక్కారు. ఇది కేవలం ఆయుధ ప్రతీక మాత్రమే కాకుండా, ఒడిస్సా ప్రజల అపారమైన భక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. సనాతన జాగరణ మంచ్ ఆధ్వర్యంలో ఈ స్వర్ణ ధనుస్సును ఒడిస్సాలోని పలు జిల్లాల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ప్రయాణం మొత్తం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, రామధనుస్సును దర్శించి పూజలు చేశారు.

వివరాలు 

ధనుస్సుకు సంప్రదాయబద్ధమైన పూజలు,పవిత్ర క్రతువులు

ముందుగా పూరీ క్షేత్రానికి చేరుకున్న ఈ ధనుస్సుకు అక్కడ సంప్రదాయబద్ధమైన పూజలు, పవిత్ర క్రతువులు నిర్వహించారు. అనంతరం, పూరీలోని పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత, ఈ స్వర్ణ ధనుస్సు శోభాయాత్రగా అయోధ్య దిశగా బయలుదేరింది. జనవరి 22న, అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు రెండేళ్లు పూర్తయ్యే వార్షికోత్సవ సందర్భంగా, ఈ అపూర్వమైన స్వర్ణ ధనుస్సును బాలరాముడి పాదాల చెంత భక్తిశ్రద్ధలతో సమర్పించనున్నారు. ఐదు శతాబ్దాల పాటు హిందువులు కంటిన కల నెరవేరి, అయోధ్య రామ మందిర నిర్మాణం కూడా పూర్తైన తరుణంలో, ఈ కానుకకు మరింత విశిష్టత చేకూరింది. అయోధ్యకు ఈ భారీ స్వర్ణ ధనుస్సు చేరుకున్న అనంతరం, భక్తులకు మరోసారి అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించనుంది.

Advertisement