Sajjan Singh Verma: బంగ్లాదేశ్ లాగానే మోదీ నివాసంలోకి కూడా ప్రజలు ప్రవేశిస్తారు: కాంగ్రెస్ నేత
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ సింగ్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక, బంగ్లాదేశ్ తరహా పరిస్థితి భారత్‌లోనూ వస్తుందని ఆయన అన్నారు. షేక్ హసీనా ఇంట్లోకి ప్రజలు ఎలా ప్రవేశించారో, అప్పుడు నరేంద్ర మోదీఇంట్లోకి కూడా ప్రవేశిస్తారని వర్మ అన్నారు. వర్మకు సంబంధించిన ఈ వీడియో వైరల్ అవుతోంది. సజ్జన్ సింగ్ వర్మ ఈ వివాదాస్పద వ్యాఖ్య చేసినప్పుడు, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితూ పట్వారీతో సహా పలువురు నేతలు వేదికపై ఉన్నారు. ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతి, పన్నుల పెంపు ఆరోపణలకు నిరసనగా కాంగ్రెస్ పెద్ద ప్రదర్శన నిర్వహించింది. ఈ ప్రసంగంలో సజ్జన్ సింగ్ వర్మ భారత్‌ను శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పోల్చారు.
సల్మాన్ ఖుర్షీద్ కూడా ఇదే తరహా ప్రకటన
సజ్జన్ సింగ్ వర్మ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ నాయకులలో ఒకరు.మంత్రిగా, ఎంపీగా కూడా పనిచేశారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ కూడా ఇదే తరహా ప్రకటన చేశారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్నదే భారత్‌లో కూడా జరుగుతుందని ఖుర్షీద్ మంగళవారం అన్నారు. ఢిల్లీలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఖుర్షీద్ మాట్లాడుతూ.. పైకి అంతా బాగానే అనిపించినా, బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి భారత్‌లో కూడా రావచ్చని అన్నారు. రిజర్వేషన్లకు సంబంధించి బంగ్లాదేశ్‌లో గత రెండు నెలలుగా పెద్దఎత్తున నిరసనలు, ఆందోళనలు జరగడం గమనార్హం. షేక్ హసీనా సోమవారం అకస్మాత్తుగా ఆ పదవికి రాజీనామా చేసి విమానంలో భారత్‌కు పారిపోయారు. అనంతరం ఆమె నివాసంలోకి ప్రవేశించిన ఆందోళనకారులు భారీగా లూటీ చేశారు.