Konaseema: సముద్ర జలాలతో మోడువారిన 2 లక్షలకు పైగా కొబ్బరి చెట్లు.. రాజోలు నియోజకవర్గంలో 2,000 ఎకరాల్లో తీవ్ర నష్టం
ఈ వార్తాకథనం ఏంటి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో సముద్రపు లవణజలాల దాడి వేగం పెరుగుతోంది. ఈ ప్రభావంతో వేలాది ఎకరాల కొబ్బరి తోటలు క్రమంగా నశించిపోతుండగా, లక్షల్లో ఉన్న కొబ్బరి చెట్లు మోడువారిపోయాయి. దాంతో దాదాపు 1,200 మంది రైతు కుటుంబాలు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో సుమారు 30 గ్రామాలు పూర్తిగా మాయం కావచ్చని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 26న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతాల్లో పర్యటనకు రానుండడంతో, రైతులు ఆయన హామీలను ఆసరాగా చూస్తున్నారు.
వివరాలు
లవణ జలాలు వెనక్కి తన్నుకుని తోటల్లోకి, గ్రామాల్లోకి..
ఈ సంక్షోభానికి మూలం శంకరగుప్తం డ్రెయిన్ అనే కాలవ. దాదాపు 22.5 కి.మీ.పొడవున ప్రవహించే ఈ డ్రెయిన్‌లోకి రాజోలు,మామిడికుదురు,సఖినేటిపల్లి, మలికిపురం మండలాల నుంచి మురుగు నీరు, వర్షపు నీరు చేరి చివరగా కేశవదాసుపాలెం-కరవాక వద్ద నుంచి వైనతేయ గోదావరిలో కలుస్తాయి. 2017 నుంచి 2020 మధ్య కేశనపల్లి-కరవాక మధ్య 8.5 కి.మీ. మేర మాత్రమే పూడిక తొలగింపు చేశారు. అక్కడ 15 అడుగుల లోతు ఉండగా, మిగతా భాగాల్లో కేవలం 5 అడుగుల వరకే లోతు ఉండటంతో సమస్య మరింత తీవ్రమైందని స్థానికులు చెబుతున్నారు. దీంతో నెలలో దాదాపు పది రోజుల పాటు సముద్రపు పదరు, పోటు సమయాల్లో శంకరగుప్తం డ్రెయిన్ నుంచే లవణ జలాలు వెనక్కి తన్నుకుని తోటల్లోకి, గ్రామాల్లోకి చేరుతున్నాయి.
వివరాలు
పరిష్కారం ఇలా..
ఈ వరదలతో కరవాక, గుబ్బలపాలెం, శంకరగుప్తం, కేశనపల్లి, తూర్పుపాలెం, పడమటిపాలెం, గోగన్నమఠం, గూడపల్లి పల్లిపాలెం, అడవిపాలెం, చింతలమోరి వంటి 12 గ్రామాల్లో దాదాపు 2,000 ఎకరాల్లో ఉన్న లక్షన్నర నుంచి రెండు లక్షల చెట్లు పూర్తిగా నాశనమయ్యాయని రైతులు చెబుతున్నారు. శంకరగుప్తం డ్రెయిన్‌లో మిగిలిన 9.5 కి.మీ. భాగాన్ని కూడా డ్రెడ్జింగ్ చేయడంతోపాటు, ఇరువైపులా సుమారు 30 కి.మీ. మేర గట్లు నిర్మించాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అక్కడ పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. డ్రెడ్జింగ్, గట్ల నిర్మాణానికి రూ.21 కోట్ల వ్యయంతో రూపొందించిన ప్రతిపాదనను ఆర్థిక శాఖకు పంపించారు.
వివరాలు
లవణసాంద్రత పెరిగి..
ఈ పనులు తాత్కాలిక ఉపశమనాన్ని అందించినా, ఇప్పటికే మోడువారిపోయిన చెట్లను తొలగించి కొత్త నాట్లను వేసేందుకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సహాయం అందిస్తేనే కొబ్బరి రైతులు తిరిగి నిలదొక్కుకోగలరని వారు అంటున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం నుంచి వారానికి రెండు లక్షల కొబ్బరి కాయలు ఎగుమతి అయ్యేవి. కానీ ఇప్పుడు నెలకు లక్ష కాయలకే చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. సముద్రపు నీరు తోటల్లోకి చేరడంతో లవణసాంద్రత పెరిగి, మొదట ఆకులు పసుపు రంగులోకి మారి, ఆ తర్వాత చెట్లు పూర్తిగా ఎండిపోతున్నాయని అంబాజీపేట కొబ్బరి పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డీ. ముత్యాలనాయుడు వివరణ ఇచ్చారు.