Vijayawada: విజయవాడలో వేగంగా పారిశుద్ధ్య పనులు
విజయవాడ నగరంలో వరద పరిస్థితి క్రమంగా తగ్గుతోంది. సింగ్ నగర్, పాయకాపురం, కండ్రిక ప్రాంతాల్లో వరద నీరు 2 అడుగుల మేర తగ్గింది. కొన్నిచోట్ల రోడ్లపై ఇంకా వరద ప్రవహిస్తూనే ఉంది. బుడమేరు గండ్లు పూర్తిగా పూడ్చివేయడంతో పలు ప్రాంతాలు ముంపు నుంచి బయటపడుతున్నాయి. శనివారం మధ్యాహ్నం నుంచి అల్పపీడనం ప్రభావంతో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తున్నప్పటికీ వరద ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య పనులను వేగవంతం చేశారు. వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నిత్యావసర సరకులు పంపిణీ చేస్తోంది.
నెక్స్‌జెన్ ఫీడ్స్ సంస్థ రూ.కోటి విరాళం
ఏపీలో వరద సహాయ చర్యలకు మద్దతుగా నెక్స్‌జెన్ ఫీడ్స్ సంస్థ రూ. కోటి విరాళం ప్రకటించింది. సంస్థ ఎండీ ఎ.వి. సుబ్రమణ్యం సీఎం చంద్రబాబుకు విరాళం చెక్కును అందించారు. కృష్ణా నదిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద త్వరలోనే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3.88 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది