LOADING...
Sankranthi Sambaralu: సంక్రాంతికి ముందే పిఠాపురంలో పండుగ మూడ్‌.. ప్రారంభించనున్న పవన్‌కల్యాణ్‌ 
ప్రారంభించనున్న పవన్‌కల్యాణ్

Sankranthi Sambaralu: సంక్రాంతికి ముందే పిఠాపురంలో పండుగ మూడ్‌.. ప్రారంభించనున్న పవన్‌కల్యాణ్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2026
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

సంక్రాంతి పండుగకు ముందుగానే కాకినాడ జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ స్వంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టణంలోని ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్‌ జూనియర్‌ కాలేజ్‌ మైదానంలో జరగనున్న 'పీఠికాపురి సంక్రాంతి మహోత్సవాలు'ను ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. సాంప్రదాయాలు,సంస్కృతి ప్రతిబింబించేలా వేదికతో పాటు మైదానాన్ని ఆకర్షణీయంగా అలంకరించారు. గ్రామీణ జీవనశైలిని గుర్తు చేసే విధంగా రంగురంగుల ముగ్గులతో పూరిల్లు, పక్కనే నీటిబావి,ధాన్యం బస్తాలతో కూడిన ఎడ్లబండి ఏర్పాటు చేశారు. చేనేత,హస్తకళలు,కొండపల్లి బొమ్మలతో పాటు పశుసంవర్ధక,మాతా-శిశు సంక్షేమ శాఖల స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అంతేకాదు,నోరూరించే పిండివంటలు ప్రదర్శించనున్నారు.

వివరాలు 

ప్రతిరోజూ ప్రత్యేక కార్యక్రమాలు

మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రతిరోజూ ప్రత్యేక కార్యక్రమాలు ఉండేలా నిర్వాహకులు ప్రణాళిక రూపొందించారు. తొలి రోజున థింసా, రేలారే రేలా, కొమ్ము, కోయ, గరగ నృత్యాలు, కోలాటం, డప్పుల ప్రదర్శనలు జరగనుండగా, సినీ కళాకారుల వినోద కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. కూచిపూడి నృత్య ప్రదర్శనతో పాటు సంగీత విభావరి కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఈ ఉత్సవాల్లో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్, నారాయణ పాల్గొననున్నారు.

వివరాలు 

కాకినాడ జిల్లాలో రూ.211 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

అలాగే జబర్దస్త్‌ కమెడియన్‌ హైపర్‌ ఆది, క్రికెటర్‌ అంబటి రాయుడు తదితర ప్రముఖులు హాజరవుతారు. రెండో రోజున ఎమ్మెల్సీ నాగబాబు తో పాటు జబర్దస్త్‌ కార్యక్రమానికి చెందిన కళాకారులు పాల్గొననున్నారు. మూడో రోజున ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌, నటులు నవీన్‌ పోలిశెట్టి, కిరణ్‌ అబ్బవరం వేడుకలకు రానున్నారు. సంక్రాంతి సంబరాల వేదికగానే కాకినాడ జిల్లాలో రూ.211 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.

Advertisement