Andhra News: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవాలు.. మూడు రోజులు.. మూడు ప్రాంతాలు.. మహా సంబరం
ఈ వార్తాకథనం ఏంటి
సంక్రాంతి అనగానే కోస్తా ప్రాంతాల్లో ప్రత్యేక సందడి మొదలవుతుంది. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల సందడి, గంగిరెద్దుల ఊరేగింపులు, కోడిపందేలు... ఇవన్నీ ఈ పండుగకు ప్రతీకలు. సంక్రాంతి సమయం వచ్చిందంటే గోదావరి జిల్లాలు, ముఖ్యంగా కోనసీమలోని పచ్చని పల్లెలు పండగ శోభతో మురిసిపోతాయి. ప్రభల తీర్థాలు, కోడిపందేలు, రుచికరమైన పిండివంటలు ఎక్కడెక్కడివారిని రా రమ్మని ఆహ్వానిస్తాయి. పెద్ద పండగకు మరింత వైభవం జోడించేందుకు ఈసారి రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి ఉత్సవాలను అంబరాన్నంటేలా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు స్థానిక సంఘాలు, ప్రజల ఆధ్వర్యంలో జరిగే సంక్రాంతి వేడుకలకు ఈసారి ప్రభుత్వమే సమగ్ర రూపకల్పన చేసింది. ప్రత్యేకంగా నిధులు కేటాయించి, పండుగకు ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేలా చర్యలు చేపట్టింది.
వివరాలు
స్పెషల్ అట్రాక్షన్..డ్రాగన్ పడవ రేసులు
ఆత్రేయపురం, ఎస్.యానాం, పిఠాపురం ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలను అట్టహాసంగా నిర్వహిస్తోంది. కేరళలో ఓనం సందర్భంగా జరిగే పడవ పోటీల తరహాలో ఈసారి డ్రాగన్ బోట్ రేసులు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వీటితో పాటు ఈత పోటీలు, గాలిపటాల పోటీలు, మహిళల కోసం రంగవల్లుల పోటీలు, కోనసీమ సంప్రదాయ పిండివంటలతో ప్రత్యేక ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు.
వివరాలు
వేలాదిగా తరలివచ్చే సందర్శకులు
ఆత్రేయపురం అంటేనే పూతరేకుల తియ్యదనం, లొల్ల లాకుల అందం గుర్తొస్తాయి. ఈ ప్రాంతంలో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. గత ఏడాది తొలిసారి ఇక్కడ ఘనంగా నిర్వహించిన సంక్రాంతి వేడుకలకు విశేష స్పందన లభించింది. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చొరవతో ఏర్పడిన సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ అసోసియేషన్, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మూడు రోజుల పాటు పడవ పోటీలు, సంక్రాంతి సంబరాలు నిర్వహించింది. ఆ వేడుకలకు వేలాది మంది హాజరయ్యారు. ఈసారి ప్రభుత్వం సంక్రాంతి ఉత్సవాల కోసం రూ.కోటి నిధులు కేటాయించింది. రోజుకు 10 వేల మందికి పైగా సందర్శకులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
వివరాలు
మూడు రోజుల పాటు పండుగ సందడి
ఈ సంక్రాంతికి ఆత్రేయపురం మూడు రోజుల పాటు కళకళలాడనుంది. ఈ నెల 11న ఆత్రేయపురం రేవులోని బొబ్బర్లంక ప్రధాన కాలువలో ఈత పోటీలు జరుగుతాయి. 14 ఏళ్లు నిండినవారు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు.విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.8 వేలు,ద్వితీయ బహుమతిగా రూ.6 వేలు,తృతీయ బహుమతిగా రూ.4వేలు అందజేయనున్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో డ్రాగన్ పడవ పోటీలు నిర్వహించనున్నారు.అలాగే 11న ఆత్రేయపురం మెయిన్ రోడ్డులో మహిళల కోసం రంగవల్లుల పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్లో విజేతలకు వరుసగా రూ.20 వేలు,రూ.10 వేలు,రూ.5 వేల బహుమతులు ఇస్తారు. 13న లంక ప్రాంతాల్లో గాలిపటాల పోటీలు నిర్వహిస్తారు.వీటిలో ప్రథమ బహుమతిగా రూ.6 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.4 వేలు,తృతీయ బహుమతిగా రూ.3 వేలు అందజేస్తారు.
వివరాలు
పిండివంటల రుచులు… పాటల హోరు
లొల్ల లాకుల వద్ద బోటింగ్ సదుపాయం కల్పించడంతో పాటు పిల్లల కోసం ప్రత్యేక ఆటస్థలిని ఏర్పాటు చేస్తున్నారు. కాలువల్లో విహరించేందుకు రెండు స్పీడ్ బోట్లు, ఒక జెట్ స్కీ అందుబాటులో ఉంటాయి. ఆత్రేయపురం పూతరేకులు, కండ్రిగ పాలకోవా, నగరం గరాజీలు, నార్కెడుమిల్లి పచ్చళ్లు... ఇలా కోనసీమలోని ప్రతి ప్రాంతానికీ ప్రత్యేకమైన పిండివంటల గుర్తింపు ఉంది. ఈ రుచులన్నింటినీ ఒకేచోట అందుబాటులో ఉంచి, సందర్శకులకు కొత్త అనుభూతిని అందించనున్నారు. అహ్లాదకరమైన లొల్ల లాకుల వద్ద ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తున్నారు. కోనసీమ పిండివంటలన్నింటినీ ఒకేచోట ఆస్వాదించే అరుదైన అవకాశం సందర్శకులకు లభించనుంది.
వివరాలు
'ఆంధ్రా గోవా'లోనూ సంక్రాంతి హడావుడి
సాయంత్రం వేళల్లో ప్రముఖ గాయకుల సినీ సంగీత విభావరులు ఆకట్టుకోనున్నాయి. ఈ నెల 11న ఆత్రేయపురంలోని మహాత్మాగాంధీ జూనియర్ కాలేజీ మైదానంలో సంగీత విభావరి జరుగుతుంది. మాళవిక, సాయిశిల్ప, హనుమాన్ తదితర గాయకులు పాల్గొంటారు. 12న సెహరి బ్యాండ్ ఆర్కెస్ట్రా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆంధ్రా గోవాగా పేరుగాంచిన కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలో ఈ నెల 14, 15, 16 తేదీల్లో సంక్రాంతి వేడుకలు జరుగుతాయి. ఒకవైపు గోదావరి వెనుక జలాలు,మరోవైపు విశాల సముద్రం ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ప్రతిరోజూ సినీ గాయకుల సంగీత విభావరులతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. గీతామాధురి, మోహన భోగరాజు, సాకేత్ తదితరులు తమ గానంతో అలరించనున్నారు.
వివరాలు
పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో వేడుకలు
పిఠాపురంలోని మున్సిపల్ స్కూల్ ప్రాంగణంలో ఈ నెల 9, 10, 11 తేదీల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల కోసం ప్రభుత్వం రూ.4.80 లక్షలు మంజూరు చేసింది. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ నెల 9న వేడుకలను ప్రారంభించనున్నారు. గోపూజ, చిన్నారులకు భోగిపళ్లు పోయడం, ఫ్యాన్సీ డ్రస్ పోటీలు, రంగవల్లుల పోటీలు జరుగుతాయి. సుమారు 300 మంది కళాకారులు 27 రకాల కళారూపాలను ప్రదర్శించనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల స్టాళ్లు కూడా ఏర్పాటు చేయనున్నారు.
వివరాలు
కేరళను తలపించే పడవ పోటీలు
కేరళలో ఓనం వంటి ప్రత్యేక పండుగల సందర్భంగా జరిగే పడవ పోటీలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. సన్నగా, పొడవుగా ఉండే ఈ పడవలను అక్కడ 'స్నేక్ బోట్లు'గా పిలుస్తారు. అళప్పుజలోని పున్నమడ సరస్సులో జరిగే నెహ్రూ ట్రోఫీతో పాటు అరన్‌ముల, చాంపక్కుళం, కొచ్చి వంటి ప్రాంతాల్లో జరిగే పోటీలను చూడటానికి దేశ విదేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. ఇకపై ఈ దృశ్యాలను చూడటానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు కేరళ వెళ్లాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆత్రేయపురంలోనే ఆ అవకాశాన్ని కల్పిస్తోంది.
వివరాలు
కేరళను తలపించే పడవ పోటీలు
సంక్రాంతి సందర్భంగా కేరళ తరహాలో డ్రాగన్ పడవ పోటీలు నిర్వహించనుంది. ఈ నెల 12, 13 తేదీల్లో ఆత్రేయపురంలోని బొబ్బర్లంక ప్రధాన కాలువలో ఈ పోటీలు జరుగుతాయి. కేరళతో పాటు ఉమ్మడి ఉభయగోదావరి, అనంతపురం, విశాఖ, కృష్ణా తదితర జిల్లాల నుంచి 25 నుంచి 30 జట్లు పాల్గొంటున్నాయి. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.2 లక్షలు, ద్వితీయ బహుమతిగా రూ.1 లక్ష అందజేయనున్నారు.