LOADING...
Bapatla: బాపట్ల జిల్లాలో కారవాన్‌ టూరిజం ప్రారంభం.. హైదరాబాద్‌-సూర్యలంక మధ్య రెండ్రోజులు నడిపేలా ప్రణాళిక
హైదరాబాద్‌-సూర్యలంక మధ్య రెండ్రోజులు నడిపేలా ప్రణాళిక

Bapatla: బాపట్ల జిల్లాలో కారవాన్‌ టూరిజం ప్రారంభం.. హైదరాబాద్‌-సూర్యలంక మధ్య రెండ్రోజులు నడిపేలా ప్రణాళిక

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 07, 2026
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

బాపట్ల జిల్లాలో ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తున్నది. సంక్రాంతి సెలవులు ఆనందంగా గడపాలనుకునే హైదరాబాద్‌ పర్యాటకుల కోసం జిల్లా పర్యాటక శాఖ సూర్యలంకకు ప్రత్యేక కారవాన్‌ విహారాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా ప్యాకేజీ ధరలు కూడా ప్రకటించింది. జిల్లాలోని బీచ్‌లను సందర్శించి రాత్రి వాహనంలోనే వుంటూ పర్యాటకులు ప్రత్యేక అనుభూతిని పొందే విధంగా ప్రణాళికలు రూపొందించారు. హైదరాబాద్‌ నుంచి వారాంతాలు, పండుగలు, సెలవు రోజులలో వేలాది మంది పర్యాటకులు తీర ప్రాంతాలను సందర్శిస్తున్నారు. రిసార్టులలో ముందుగానే గదులు బుక్‌ చేయడం జరుగుతోంది. రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో కొంతమంది పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కోవడం సామాన్యమే.

వివరాలు 

 ఓజీ డ్రీమ్‌ లైనర్స్, ఇండియా లక్సీ కారవాన్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థలకు ఏపీటీడీసీ అనుమతి 

కారవాన్‌ టూరిజానికి జిల్లాలో మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ దిశగా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ సక్రియంగా ముందడుగు తీసుకున్నారు. దసరా సెలవుల్లో కారవాన్‌ను జిల్లా బీచ్‌లకు రప్పించి, సూర్యలంక, రామాపురం బీచ్‌లలో రెండ్రోజుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. పర్యాటకులకు ఈ సేవలు, అవకాశాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఓజీ డ్రీమ్‌ లైనర్స్, ఇండియా లక్సీ కారవాన్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థలకు ఏపీటీడీసీ అనుమతి ఇచ్చింది. సంక్రాంతి సందర్భంగా పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే సందర్భంలో ప్రారంభించడానికి నిర్ణయించింది. పది నుంచి 12 సీట్లు కలిగిన కారవాన్‌కు రెండు రోజుల ప్యాకేజీ ధర రూ.85 వేలుగా, ఐదు నుంచి ఆరు సీట్ల కలిగిన చిన్న కారవాన్‌కు రూ.64 వేలుగా నిర్ణయించారు.

వివరాలు 

రెండు లేదా మూడు కుటుంబాలు కలసి కారవాన్‌ బుక్‌ చేసుకోవచ్చు 

హైదరాబాద్‌ నుంచి పర్యాటకులను తీసుకుని సూర్యలంక బీచ్‌ సందర్శనకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మొదటిరోజు రాత్రి బీచ్‌ ఒడ్డున వాహనాన్ని నిలిపి ఉంచి, మరుసటిరోజు రామాపురం బీచ్‌ సందర్శన ఏర్పాటు చేస్తారు. భోజన ఖర్చులు పర్యాటకుల స్వంతం. పర్యాటక శాఖ ప్రణాళిక ప్రకారం, భావనారాయణ స్వామి, చీరాల కుప్పడం పట్టుచీరలు, వేటపాలెం జీడిపప్పు ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, మోటుపల్లిలోని కాకతీయుల నాటి వీరభద్రస్వామి ఆలయాలను కూడా పర్యాటకులకు చూపిస్తారు. రెండు లేదా మూడు కుటుంబాలు కలసి కారవాన్‌ బుక్‌ చేసుకుని బీచ్‌ల విహారాన్ని అనుభవించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

Advertisement