LOADING...
Bathukamma Sarees : బతుకమ్మ పండగకు చీరలు పంపిణీ.. ఈసారి వారికి మాత్రమే అందజేత!
బతుకమ్మ పండగకు చీరలు పంపిణీ.. ఈసారి వారికి మాత్రమే అందజేత!

Bathukamma Sarees : బతుకమ్మ పండగకు చీరలు పంపిణీ.. ఈసారి వారికి మాత్రమే అందజేత!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 09, 2025
09:08 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈనెల 21వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగ వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద 'అక్కా-చెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక' పేరుతో చేనేత చీరలను అందజేయనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో 18ఏళ్లు పైబడిన మహిళకు ఆధార్ కార్డు ఆధారంగా ఒక్కో చీర ఇచ్చేవారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వేరే విధానం చేపట్టింది. స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) సభ్యులకు మాత్రమే ఈసారి చీరలు పంపిణీ చేయనున్నారు. అంతేకాక ఒక్కొక్కరికీ ఒక చీర కాకుండా, రెండేసి చీరలు అందజేయనున్నారు.

Details

కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలిసారిగా  పంపిణీ

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా బతుకమ్మ చీరల పంపిణీ జరగనుంది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని వచ్చే వారం నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా చీరల పంపిణీకి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఇప్పటికే తెలంగాణ హ్యాండ్‌లూమ్స్ శాఖ నుంచి చీరలు జీహెచ్ఎంసీకి చేరాయి. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ చీరలను జీహెచ్ఎంసీ అధికారులు అందించనున్నారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 49,714 స్వయం సహాయక సంఘాల గ్రూపులు ఉన్నాయి.

Details

ఐదు లక్షలు చీరలు పంపిణీ

ఒక్కో గ్రూపులో 10మంది మహిళలు ఉండగా, మొత్తం ఐదు లక్షల చీరలు జీహెచ్ఎంసీకి అందినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 21 నుంచి బతుకమ్మ ఉత్సవాలు మొదలుకానుండగా, అంతకుముందే ఈ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి చీరల విలువ రూ.800గా ఉండనుంది. ప్రతీ చీర ప్రత్యేక కవర్‌లో అందజేయనున్నారు. అలాగే బతుకమ్మ పండుగకు ఒక చీర పంపిణీ చేస్తూ, రాబోయే సంక్రాంతి పండుగకు మరో చీర అందించనున్నట్లు సమాచారం.