Ayodhya: అయోధ్య రామాలయంలో నగదు లెక్కింపునకు ఎస్‌బీఐ కొత్త బృందం
ఈ వార్తాకథనం ఏంటి
విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో అయోధ్య రామాలయంలో నగదు లెక్కింపు ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టారు. ఆలయానికి వచ్చే నగదును లెక్కించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. కొత్త విధానాన్ని అమలు చేయడానికి ముందు దాదాపు వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా పరిశీలించి,అనంతరం ఆదివారం నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలిపాయి. శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నగదు లెక్కింపు బాధ్యతలను అధికారికంగా ఎస్‌బీఐకి అప్పగించింది. ఇకపై ఎస్‌బీఐ సిబ్బంది రోజుకు రెండు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తూ నగదు లెక్కిస్తారు. ప్రతి షిఫ్టులో 10 నుంచి 12 మంది సిబ్బంది పాల్గొంటారు.
వివరాలు
కొత్త ఇన్‌ఛార్జిగా శోభనాథ్ మిశ్ర
మొదటి షిఫ్టు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు,రెండో షిఫ్టు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది.
గతంలో నగదు లెక్కింపు విభాగానికి ఇన్‌ఛార్జిగా పనిచేసిన సుభాష్ శ్రీవాస్తవ విరాళాల స్వాహా కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన నేపథ్యంలో,ఆయన స్థానంలో శోభనాథ్ మిశ్రను కొత్త ఇన్‌ఛార్జిగా నియమించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
అదే సమయంలో ట్రస్టు భద్రతా విభాగం ఇన్‌ఛార్జిగా ఉన్న మాజీ సైనికాధికారి కెప్టెన్ కె.కె.తివారీకి నగదు లెక్కింపు ప్రక్రియపై సీనియర్ బాధ్యతలు అప్పగించారు.
లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షించేందుకు ట్రస్టు తరఫున మాజీ రక్షణ ఉద్యోగులు ఎస్.పి. దుబే, శేషమణి తివారీ ప్రతినిధులుగా వ్యవహరిస్తారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.