Patanjali: 'పతంజలి' ప్రకటనలపై సుప్రీంకోర్టు నిషేధం
ప్రముఖ ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ 'పతంజలి'కి సంబంధించిన తప్పుడు ప్రకటనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. 'పతంజలి' కంపెనీ ప్రకటనలను ధర్మాసనం పూర్తిగా నిషేధం విధించింది. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్, 1954 ప్రకారం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే, పతంజలి ఆయుర్వేద, దాని మేనేజ్‌మెంట్ డైరెక్టర్ (ఎండీ) ఆచార్య బాలకృష్ణకు కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. ప్రకటనలను ఇవ్వొద్దని సుప్రీంకోర్టు ఆదేశించినా.. మళ్లీ యాడ్స్ ప్రసారం చేయడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కోర్టు ధిక్కార నోటీసులను జారీ చేసింది.
కేంద్రాన్ని మందలించిన సుప్రీంకోర్టు
పతంజలి ఆయుర్వేదానికి సంబంధించిన తప్పుదోవ పట్టించే ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు కూడా స్పందించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మందలించింది. తప్పుడు ప్రకటనతో దేశం మొత్తాన్ని పతంజలి కంపెనీ మోసం చేస్తోందని కోర్టు పేర్కొంది. ఈ విషయంలో ప్రభుత్వం కళ్లు మూసుకుందా ? ధర్మాసనం ప్రశ్నించింది. ఇది చాలా దురదృష్టకరమని కోర్టు పేర్కొంది. తప్పుడు ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కోర్డు ఆర్డర్ ఉన్నా యాడ్స్ ఇస్తారా? మీకు చాలా ధైర్యం ఉందని జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా పతంజలిపై తీవ్రంగా మండిపడ్డారు.