Loading...
Supreme Court: దిల్లీ పోలీసుల చర్యలపై విచారణకు కమిటీ.. జస్టిస్ సుభాష్‌ రెడ్డి నేతృత్వం
దిల్లీ పోలీసుల చర్యలపై విచారణకు కమిటీ.. జస్టిస్ సుభాష్‌ రెడ్డి నేతృత్వం

Supreme Court: దిల్లీ పోలీసుల చర్యలపై విచారణకు కమిటీ.. జస్టిస్ సుభాష్‌ రెడ్డి నేతృత్వం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2026
05:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో విద్యార్థుల నిరసనల సందర్భంగా భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరుపై వచ్చిన ఆరోపణలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. విద్యార్థులపై పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో పాటు, నిరసనల సమయంలో చోటుచేసుకున్న ఇతర పరిణామాలపై కూడా ఈ కమిటీ సమగ్రంగా విచారణ జరపనుంది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, తెలంగాణకు చెందిన జస్టిస్‌ ఆర్. సుభాష్‌ రెడ్డి నేతృత్వం వహించనున్నారు. పంజాబ్‌-హరియాణా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రవిశంకర్‌ ఝా, దిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ శాలిందర్‌ కౌర్‌, సీబీఐ మాజీ డైరెక్టర్‌ రిషి కుమార్‌ శుక్లా, మేఘాలయ మాజీ డీజీపీ ఎల్.ఆర్. బిష్ణోయ్‌ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

వివరాలు 

బాధ్యులైన ఎవరినీ వదిలిపెట్టబోమన్న సుప్రీంకోర్టు

విద్యార్థి ఉద్యమకారులతో పోలీసులు ఎలా వ్యవహరించారు? మహిళలపై హింసకు సంబంధించిన ఘటనలు ఏమైనా చోటుచేసుకున్నాయా? బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందిందా? వారికి నష్టపరిహారం చెల్లించారా? వంటి అంశాలను కమిటీ పరిశీలించనుంది.

అదే సమయంలో పోలీసు సిబ్బందిపై హింసకు పాల్పడ్డారన్న ఆరోపణలు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారన్న అధికారుల వాదనలను కూడా కమిటీ పరిగణనలోకి తీసుకోనుంది.

ఈ వ్యవహారంలో బాధ్యులైన ఎవరినీ వదిలిపెట్టబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

''ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. దీనికి ఒక పరిష్కారం చూపేందుకే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నాం'' అని ధర్మాసనం పేర్కొంది.

జులై 20న జరిగిన 'చలో పార్లమెంటు' కార్యక్రమంలో చోటుచేసుకున్న హింసకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాల రికార్డులను కమిటీకి అందజేయాలని ఆదేశించనున్నట్లు తెలిపింది.

ADVERTISEMENT