NCERT: ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తక వివాదం.. ముగ్గురు విద్యావేత్తలపై నిషేధం ఎత్తేసిన సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో వచ్చిన "న్యాయవ్యవస్థలో అవినీతి" అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు న్యాయవ్యవస్థపై తప్పుదారి పట్టించే సమాచారం అందిస్తున్నారని పేర్కొంటూ ఎన్‌సీఈఆర్‌టీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఎన్‌సీఈఆర్‌టీ బహిరంగ క్షమాపణ చెప్పి,అభ్యంతరకర అంశాలను తన వెబ్‌సైట్ నుంచి తొలగించింది. అలాగే ఆ పుస్తకాల పంపిణీని కూడా నిలిపివేసింది.ఈ వ్యవహారంలో తాజాగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ముగ్గురు విద్యావేత్తలపై విధించిన నిషేధాన్ని ఉపసంహరించుకుంది. అలాగే వారు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను వక్రీకరించారంటూ చేసిన వ్యాఖ్యలను కూడా వెనక్కి తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు మార్చి 11న జారీ చేసిన ఉత్తర్వులను సవరించింది.
వివరాలు
గతంలో ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం
ప్రొఫెసర్ మైఖేల్ డానినో, సుపర్ణ దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్‌లను విద్యా సంబంధిత కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని గతంలో కేంద్ర ప్రభుత్వం,రాష్ట్రాలు, విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే తాజాగా ఆ ఆదేశాలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం వెలువరించింది. దరఖాస్తుదారులు సమర్పించిన వివరణలను పరిశీలించిన తర్వాత గత ఉత్తర్వుల్లోని సూచనలను సవరించడం సముచితమని భావించినట్లు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ఇతర సంస్థలు తమకు తామే నిర్ణయం తీసుకోవచ్చని ధర్మాసనం పేర్కొంది. అలాగే ఈ ముగ్గురు విద్యావేత్తలు కావాలనే వాస్తవాలను తప్పుగా చూపించారన్న వ్యాఖ్యలను కూడా సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. వారు ఇచ్చిన వివరణల నేపథ్యంలో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
వివరాలు
సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు
ఫిబ్రవరి 2026లో "మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర" అనే అధ్యాయంలో న్యాయవ్యవస్థలో అవినీతి గురించి ఉన్న కొన్ని అంశాలు పెద్ద వివాదానికి దారితీశాయి. దీనిపై వచ్చిన వార్తల నేపథ్యంలో సుప్రీంకోర్టు స్వయంగా ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. అనంతరం ఎన్‌సీఈఆర్‌టీ ఆ పాఠ్యాంశాన్ని "అనుకోకుండా జరిగిన పొరపాటు"గా పేర్కొంటూ పుస్తకం నుంచి తొలగించింది. ఈ కేసు విచారణ సమయంలో ఆ పుస్తకాల ముద్రణ, పంపిణీపై తాత్కాలిక నిషేధం విధించిన సుప్రీంకోర్టు.. పాఠ్యపుస్తకాల తయారీ, సిలబస్ రూపకల్పనలో ఈ ముగ్గురు నిపుణులను ఎట్టి పరిస్థితుల్లోనూ భాగస్వామ్యం చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు అదే ఆదేశాలను సవరించడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది.