Karthigai Deepam row: రేపు తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే.. తమిళనాడుకు సుప్రీం ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం కొండపై కార్తిక పౌర్ణమి సందర్భంగా పురాతన రాతిస్తంభంపై దీపం వెలిగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని స్పష్టం చేసింది. శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ రాతిస్తంభంపై కార్తిక దీపం వెలిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారానికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మదురై జిల్లా కలెక్టర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.
వివరాలు
హైకోర్టు ఆదేశాల నుంచి సుప్రీంకోర్టు వరకు..
తిరుప్పరంకుండ్రంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మూలవిరాట్టు శిరస్సుకు నేరుగా పైన ఉన్న ఉచ్చిప్పిళ్లైయార్ ఆలయ సమీపంలోని దీప మండపంపై ఏళ్లుగా కార్తిక మహాదీపాన్ని వెలిగిస్తున్నారు.
అయితే,అదే కొండపై ఉన్న సిక్కందర్ దర్గా సమీపంలోని పురాతన రాతిస్తంభంపై కూడా దీపం వెలిగించాలనే అంశం కొన్నేళ్లుగా వివాదానికి కారణమవుతోంది.
ఈ నేపథ్యంలో గత ఏడాది మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం రాతిస్తంభంపై దీపం వెలిగించాలని ఆదేశాలు జారీ చేసింది.
అయినప్పటికీ వాటిని అమలు చేయలేదు.దీంతో ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది.
ఈ ఏడాది మాత్రం పురాతన రాతిస్తంభంపై కార్తికదీపం వెలిగించేందుకు అనుమతిస్తూ అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
అయితే, ఆ ఆదేశాలను పక్కనపెట్టి కార్తిక పౌర్ణమి రోజున ఉచ్చిప్పిళ్లైయార్ ఆలయ దీప మండపంపైనే మహాదీపాన్ని వెలిగించారు.
వివరాలు
ఆలయ భద్రత సీఆర్పీఎఫ్‌కు.. ట్రస్టీల బోర్డు సస్పెన్షన్
దీంతో మరోసారి వివాదం చెలరేగింది. సుప్రీంకోర్టు ఆదేశాలను తమిళనాడు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిందని ఆరోపిస్తూ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది.
ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై తీవ్రంగా స్పందించింది.
కోర్టు ఆదేశాలను నిర్లక్ష్యం చేసినందుకు సుబ్రహ్మణ్యస్వామి ఆలయ ట్రస్టీల బోర్డును సస్పెండ్ చేసింది.
అంతేకాకుండా, శనివారం ఎలాంటి పరిస్థితుల్లోనూ రాతిస్తంభంపై దీపం వెలిగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో తమిళనాడు పోలీసులు విఫలమయ్యారని అభిప్రాయపడిన ధర్మాసనం.. సుబ్రహ్మణ్యస్వామి ఆలయం, తిరుప్పరంకుండ్రం కొండ భద్రతా బాధ్యతలను కేంద్ర రిజర్వ్ పోలీసు దళం (సీఆర్పీఎఫ్)కు అప్పగించింది.
వివరాలు
ఏఎస్‌ఐ ఆరోపణలు..
విచారణ సమయంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) కూడా తన వాదనలను న్యాయస్థానం ముందు ఉంచింది.
రాతిస్తంభం వద్దకు వెళ్లేందుకు తమిళనాడు పోలీసులు తమ అధికారులను అనుమతించలేదని తెలిపింది.
అయితే, ఏఎస్‌ఐ చేసిన ఈ ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది.
నవంబరు 21 నుంచే పురావస్తు శాఖ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని వివరించింది.
మరోవైపు, తిరుప్పరంకుండ్రం కొండ పరిసరాల్లో భద్రత కోసం ఐదు వేల మంది పోలీసులను విధుల్లో పెట్టినట్లు మదురై పోలీసు కమిషనర్ ధర్మాసనానికి వెల్లడించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ఈ వ్యవహారంలో కీలక వ్యాఖ్యలు చేసింది.
వివరాలు
కోర్టు ధిక్కరణపై సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక
రాష్ట్ర పాలనా యంత్రాంగంలోని అధికారులు ఉద్దేశపూర్వకంగానే కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు ప్రాథమికంగా కనిపిస్తోందని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై చర్చలు జరిపే అవకాశం లేదని తేల్చి చెప్పింది.
న్యాయ ప్రక్రియను తప్పుదోవ పట్టించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే, వారు ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ సహించేది లేదని సుప్రీంకోర్టు హెచ్చరించింది.