Page Loader
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.. 

చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే.. 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 25, 2023
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబుకి సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు స్పందించింది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ పై చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వేసిన క్వాష్ పిటిషన్‌‌ను సోమవారం మెన్షన్ చేశారు. అయితే చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న కారణంగా, పిటిషన్ను అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు స్పందించింది. చంద్రబాబు ఎప్పటి నుంచి రిమాండ్‌లో ఉన్నారని ప్రశ్నించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, క్వాష్ పిటిషన్‌ను రేపు మెన్షన్ లిస్టులో చేర్చుతామన్నారు. ఫలితంగా ఈ పిటిషన్‌పై విచారణ ఎప్పుడు అన్న విషయం మంగళవారం చెప్పనున్నారు. మరోవైపు సోమ, మంగళ, బుధవారం మాత్రమే ఈవారంలో సుప్రీంకు పనిదినాలున్నాయి.

details

సెలవుల కారణంగా మళ్లీ వచ్చే సోమవారమే విచారణ

ఈలోగా క్వాష్ పిటిషన్‌పై విచారించకపోతే, సెలవుల కారణంగా మళ్లీ వచ్చే సోమవారమే విచారణ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. మరోవైపు చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు శని, ఆదివారాలు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే దాదాపుగా 12 గంటలు ప్రశ్నించారు. ఈ మేరకు రూ.371 కోట్లతో పాటు 30 అంశాలపై సుమారు 120 ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. అయితే షెల్ కంపెనీల ఏర్పాటుపైనా ప్రశ్నలు కురిపించారని సమాచారం. ఈ నేపథ్యంలోనే లోకేష్‌కి దీనిపైనా ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో చర్చించినట్లు తెలిసింది. ఇందుకు సమాధానాలు చెప్పేందుకు చంద్రబాబు సహకరించలేదని అధికారులు పేర్కొన్నారు. దీంతో మరోసారి కస్టడీ కోరారు. చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ ప్రారంభమైంది.