Supreme Court: ఓటు హక్కు భావోద్వేగం..'సర్'పై సుప్రీం కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటర్ల జాబితాలో కొనసాగడం ప్రతి ఓటరుకు హక్కు అని స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణ ఒత్తిడితో ఆ ప్రక్రియను వక్రీకరించకూడదని హెచ్చరించింది. అదే సమయంలో ఈ ప్రక్రియలో ఓట్లు తొలగించారంటూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ పిటిషన్లు ఇప్పటికే అప్పీల్ ట్రైబ్యునళ్ల పరిధిలో విచారణలో ఉన్నాయని పేర్కొంది. ఎన్నికల సంఘం సరైన విధానాన్ని అనుసరించకుండా ఏకపక్షంగా పేర్లు తొలగిస్తోందని, ఆ తొలగింపులపై దాఖలైన పిటిషన్లను సమయానికి పరిష్కరించడం లేదని పిటిషనర్లు వాదించారు.
వివరాలు
19 ట్రైబ్యునళ్లు ఏర్పాటు
అయితే పిటిషనర్లు ఇప్పటికే ట్రైబ్యునళ్లను ఆశ్రయించిన నేపథ్యంలో ప్రస్తుత వాదనలు ప్రాసంగికం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ పిటిషన్ల విచారణ కోసం కలకత్తా ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు 19 ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ ట్రైబ్యునళ్ల ముందున్న అప్పీళ్ల సంఖ్య 30 లక్షల నుంచి 34 లక్షల వరకు ఉందని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ అప్పీళ్లను నిర్దిష్ట గడువులో పరిష్కరిస్తారా? లేక గడువులు పొడిగిస్తూనే ఉంటారా? అని పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రశ్నించారు.
వివరాలు
న్యాయపరమైన జోక్యం ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేలా కాకుండా ప్రోత్సహించేలా ఉండాలి: సుప్రీం
ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు స్పందిస్తూ.. దేశంలో ఓటు హక్కు రాజ్యాంగ పరిరక్షణ పొందినదే కాక భావోద్వేగంతో కూడుకున్న అంశమని పేర్కొంది. ప్రజాస్వామ్యంలో ఇది కీలక భాగమని, ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని వివరించింది. అలాగే ట్రైబ్యునళ్లపై గడువు విధిస్తూ అధిక భారం మోపడం సరికాదని అభిప్రాయపడింది. పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించినా, ఆ ప్రభావం ఎన్నికల ఫలితాలపై స్పష్టంగా పడితే తప్ప ఎన్నికను రద్దు చేయలేమని స్పష్టం చేసింది. న్యాయపరమైన జోక్యం ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేలా కాకుండా ప్రోత్సహించేలా ఉండాలని సూచించింది ఇక పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీలలో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు.