Nandan Nilekani: నీట్ ఆన్‌లైన్ పరీక్షపై నందన్ నిలేకని కమిటీ నివేదిక తర్వాతే నిర్ణయం: సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
నీట్-యూజీ 2026 పరీక్షను ప్రస్తుతం అమల్లో ఉన్న పెన్-అండ్-పేపర్ విధానానికి బదులుగా పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నందన్ నిలేకని నేతృత్వంలోని ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్ ఏ సూచనలు చేస్తుందో ముందుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ,జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం విచారణ సందర్భంగా, భౌతిక విధానంలో జరిగే పరీక్షలను ఆన్‌లైన్ విధానానికి మార్చే సమయంలో సాధారణ చర్యలు సరిపోవని,సైబర్ భద్రత,డేటాబేస్ రక్షణ వంటి అంశాలపై అదనపు భద్రతా చర్యలు అవసరమని వ్యాఖ్యానించింది.
వివరాలు
పిటిషన్‌లో పరీక్షా వ్యవస్థలో పలు కీలక సంస్కరణలు కోరిన ఆర్‌జేడీ ఎంపీ
పరీక్షా వ్యవస్థలో కొత్త ఆలోచనలు, సాంకేతికంగా బలమైన భద్రతా వ్యవస్థలు అవసరమని కూడా పేర్కొంది.
ఆర్‌జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
మే 3న నిర్వహించిన నీట్-యూజీ 2026 పరీక్షలో ప్రశ్నాపత్రం లీక్ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం,నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్షను రద్దు చేసి రీ-నీట్ నిర్వహించిన తర్వాత ఆయన ఈ పిటిషన్ వేశారు.
పిటిషన్‌లో కేవలం ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణకే పరిమితం కాకుండా పరీక్షా వ్యవస్థలో పలు కీలక సంస్కరణలు కోరారు.
ఎన్‌టీఏ స్థానంలో సాంకేతిక భద్రత,పారదర్శకత,జవాబుదారీతనం కలిగిన స్వతంత్ర జాతీయ పరీక్షల అథారిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
వివరాలు
ఈ అంశాలపై స్పష్టమైన రోడ్‌మ్యాప్
అలాగే పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి, విద్యావేత్తలు, సైకాలజిస్టులు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు, పరిపాలనా నిపుణులతో ఉన్నతస్థాయి పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు.
ప్రశ్నాపత్రాలకు తప్పనిసరిగా డిజిటల్ లాకింగ్ విధానం అమలు చేయడం, నీట్‌ను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్షగా మార్చేందుకు దశలవారీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం, పరీక్షా కేంద్రాల మౌలిక సదుపాయాలు, సైబర్ భద్రత, విద్యార్థులకు అందుబాటు వంటి అంశాలపై స్పష్టమైన రోడ్‌మ్యాప్ ప్రకటించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
వివరాలు
కఠిన క్రిమినల్ చర్యలు
పరీక్ష పేపర్ లీక్‌లు,మాస్ కాపీయింగ్‌లో పాల్గొన్న వ్యక్తులు,విద్యాసంస్థలు,కోచింగ్ సెంటర్లు, మధ్యవర్తులు,అధికారులపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.
అలాగే నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు పురోగతి, అరెస్టులు, అభియోగాలపై స్థితిగతుల నివేదిక సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.
పరీక్ష ఫలితాలను కేంద్రాల వారీగా ప్రకటించి అసాధారణతలను గుర్తించేలా పారదర్శకత పెంచాలని కూడా సూచించారు.
కేంద్ర ప్రభుత్వ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుందని ధర్మాసనానికి తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినట్లుగా నందన్ నిలేకని నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ పనిచేస్తోందని చెప్పారు.
వివరాలు
నీట్ పరీక్షల్లో నిర్మాణాత్మక సంస్కరణలు కోరుతూ మరో రెండు పిటిషన్లు
ఈ కమిటీలో మాజీ ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ డేకా, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి, మాజీ విద్యాశాఖ కార్యదర్శి అనితా కర్వాల్, లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్ లాల్ మీనా సభ్యులుగా ఉన్నారని వివరించారు.
భౌతిక విధానం నుంచి ఆన్‌లైన్ పరీక్షలకు మారే సమయంలో డేటా నిల్వ, డేటాబేస్ భద్రత,సైబర్ దాడుల నివారణ వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఈ అంశాలతో పాటు నీట్ పరీక్షల్లో నిర్మాణాత్మక సంస్కరణలు కోరుతున్న మరో రెండు పిటిషన్లను కూడా ఆగస్టు 3న కలిసి విచారించనున్నట్లు తెలిపింది.
వివరాలు
నీట్‌ను కంప్యూటర్ ఆధారిత పరీక్షగా మార్చాలని సూచించిన కమిటీ
యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్, ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్లు కూడా అదే రోజున విచారణకు రానున్నాయి.
గత విచారణలో మాజీ ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన సిఫార్సుల అమలును కూడా పర్యవేక్షిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
ఆ కమిటీ కూడా భవిష్యత్తులో నీట్‌ను కంప్యూటర్ ఆధారిత పరీక్షగా మార్చాలని సూచించింది.
కాగా, మే 3న నిర్వహించిన నీట్-యూజీ పరీక్షను ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో మే 12న ఎన్‌టీఏ రద్దు చేసింది.
అనంతరం జూన్ 21న రీ-నీట్ నిర్వహించగా, పేపర్ లీక్ వ్యవహారంపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.