వడగాలుల తీవ్రతకు మానవ తప్పిదాలే కారణమంటున్న శాస్త్రవేత్తలు
వాతావరణ శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం తాజాగా చేసిన పరిశోధనలో కీలక అంశాలను వెల్లడించింది. ఏప్రిల్‌లో భారతదేశంతో పాటు బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, లావోస్‌లో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు నిపుణుల బృందం వెల్లడించింది. ముఖ్యంగా ఏప్రిల్ చివరి రెండు వారాల్లో ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. అందువల్లే ఏప్రిల్ 18న ఈశాన్య రాష్ట్రాల్లో గరిష్ఠంగా 44డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అలాగే థాయ్‌లాండ్‌లోని తక్ సిటీలో 45.4డిగ్రీలు, బంగ్లాదేశ్‌లోని ఢాకాలో పదేళ్ల గరిష్ఠానికి ఉష్ణోగ్రతలు పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. లావోస్‌లోని సిన్యాబులిలో ఏప్రిల్ 19న ఆల్ టైమ్ హై ఉష్ణోగ్రతలు 42.9డిగ్రీలుగా రికార్డయ్యాయి. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరగడం, తర్వాత వర్షాలు పడటంతో వడదెబ్బ కేసులు సడన్‌గా పెరిగినట్లు పరిశోధకులు చెప్పారు.
ముంబైలో వడగాలులకు 13మంది మృతి
ఏప్రిల్ చివరి రెండు వారాల్లో అధిక ఉష్ణోగ్రతలతో వచ్చిన వడగాలుల వల్ల ఒక్క ముంబైలోనే దాదాపు 13మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా ఇంకా ఎక్కువనే ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, లావోస్‌లో కూడా వడదెబ్బ మరణాలు నమోదయ్యాయి. వందల మంది ఆస్పత్రుల్లో చేరారు. అయితే మానవ తప్పిదాల కారణంగా సంభవించిన వాతావరణ మార్పుల వల్లే ఉష్ణోగ్రతలు, వేడిగాలలు పెరిగాయి. భారత్‌తో పాటు మిగతా మూడు దేశాల్లో తేమ వేడి తరంగాల తీవ్రత సాధారణం కంటే 30రేట్లు ఎక్కువగా నమోదైనట్లు నిపుణుల బృందం పేర్కొంది.
వాతావరణ మార్పుల వల్లే వడగళ్ల వానలు
శాస్త్రవేత్తల బృందంలో 22దేశాల ప్రతినిధులతో పాటు తిరుపతి ఐఐటీ, దిల్లీ ఐఐటీ, ముంబై ఐఐటీ, అరులలన్ ఐఎండీ శాస్త్రవేత్తలు ఉన్నారు. వాతావరణ మార్పుల వల్లే వడగళ్ల వానలు పడుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వాతావరణ మార్పులు తీవ్ర పరిణామాలకు కారణం అవుతాయని వెల్లడించారు. మామూలు వర్షాలు కురిసినట్లు వడగళ్ల వానలు కురవడమే కాకుండా, సాధారణం కంటే రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగినట్లు నిపుణుల బృందం పేర్కొంది. సాధారణంగా వడగళ్ల తుపానులు పదేళ్లకోసారి సంభవిస్తాయి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఐదేళ్లకోసారి అవకాశం ఉంది. కార్బన్ ఉద్గారాలను తగ్గించకపోతే మరో రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, తద్వారా రెండేళ్లకోసారి వడగళ్ల ఉష్ణోగ్రతలు సంభవిస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు.