LOADING...
Telangana: తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. వడదెబ్బకు ముగ్గురు మృతి
తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. వడదెబ్బకు ముగ్గురు మృతి

Telangana: తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. వడదెబ్బకు ముగ్గురు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 27, 2026
08:37 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతుండటంతో ప్రజలు తీవ్రమైన ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. అడవులతో ప్రసిద్ధి చెందిన ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఆదివారం అక్కడ గరిష్ఠంగా 45.3డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.ఇది సాధారణ స్థాయి కంటే 3.5డిగ్రీలు ఎక్కువగా ఉండటం విశేషం. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలను దాటిపోయాయి. పలు ప్రాంతాల్లో వడగాలులు వీచడంతో ప్రజలు బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. ఈ ఎండల తీవ్రత కారణంగా రాష్ట్రంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలానికి చెందిన మాదినేని ఆరోగ్య బాబు (57) అనే రైతు పొలం పనులకు వెళ్లి వడదెబ్బకు గురై అక్కడికక్కడే మృతి చెందారు.

వివరాలు 

మరో రెండు రోజులు పెరగనున్న ఎండలు.. ఆ తర్వాత వర్షాలు

అలాగే నల్గొండ జిల్లా శాలిగౌరారం ప్రాంతానికి చెందిన ఎన్. యాదయ్య (56), సూర్యాపేట జిల్లా రాఘవపురానికి చెందిన రావుల వేలాద్రి (60) కూడా వ్యవసాయ పనులు చేస్తుండగా వడదెబ్బ తగిలి ప్రాణాలు విడిచారు. మధ్యాహ్న సమయంలో రైతులు, కూలీలు అత్యంత జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత వాతావరణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం రాబోయే రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరో 1 నుంచి 2 డిగ్రీలు పెరిగే అవకాశముంది. దీంతో ఎండల ప్రభావం మరింత పెరగనుంది. అయితే ఈ వేడి నుంచి కొంత ఉపశమనం కలిగించేలా వర్ష సూచనలు కూడా కనిపిస్తున్నాయి.

వివరాలు 

అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరిక

సోమవారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో, మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 29 నుంచి మే 2 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం లేకపోతే బయటకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. దాహం లేకపోయినా తరచూ నీరు, కొబ్బరి నీరు, మజ్జిగ వంటి ద్రవాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వేయించిన, మసాలా పదార్థాలను తగ్గించి తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Advertisement