Scrub Typhus: రాష్ట్రంలో 2 వేలకు మించి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు.. 22కు చేరిన మరణాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి పాజిటివ్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. గత రెండేళ్లుగా ఏటా వెయ్యికి పైగా కేసులు నమోదు అయినప్పటికీ,ఇప్పటివరకు అధికారికంగా మరణాలు నమోదు కాలేదు. అయితే ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా మారింది. స్క్రబ్ టైఫస్ కారణంగా మృతుల సంఖ్య ఏకంగా 22కు చేరడం రాష్ట్రవ్యాప్తంగా కలవరాన్ని రేపుతోంది. అన్ని జిల్లాల్లో కేసులు గుర్తిస్తున్నప్పటికీ, గత మూడు సంవత్సరాలుగా చిత్తూరు జిల్లా అత్యధిక ప్రభావానికి లోనవుతోంది. చిత్తూరు జిల్లాలో 2023లో 548 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 2024లో 514 కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 491కేసులు నమోదయ్యాయి. జిల్లాలో వ్యాధి తీవ్రతకు గల కారణాలపై వైద్య,ఆరోగ్య శాఖలు,అనుబంధ విభాగాలు సరైన దృష్టి పెట్టలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వివరాలు
కాకినాడ జిల్లాలో198 కేసులు
తిరుపతి జిల్లాలోనూ స్క్రబ్ టైఫస్ కేసులు గణనీయంగానే ఉన్నాయి. అక్కడ 2023లో 276, 2024లో 184, ఈ ఏడాది 99 కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాది మొత్తం కేసుల పరంగా కాకినాడ జిల్లా (198 కేసులు) రెండో స్థానంలో, విశాఖపట్నం జిల్లా (158 కేసులు) మూడో స్థానంలో ఉన్నాయి. స్క్రబ్ టైఫస్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందిస్తే ప్రమాదం ఉండదని వైద్యులు సూచిస్తున్నా,ప్రజల్లో అవగాహన లోపిస్తోంది. మొదట జ్వరం వచ్చినప్పుడు సాధారణ మందులతో సరిపెట్టుకుని, పరిస్థితి తీవ్రత పెరిగిన తర్వాతే ఆసుపత్రులకు వెళ్లడం ప్రాణాపాయానికి దారి తీస్తోంది. పరిసరాల అపరిశుభ్రత, నివారణ చర్యలపై సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా సమస్యను మరింత పెంచుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
అధ్యయనం వైపు అడుగులు
శుభ్రత లోపించిన ప్రాంతాలు, తేమ ఎక్కువగా ఉండే పొదలు, వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో తేవీటి పురుగు (చిగ్గర్ మైట్) సంచారం అధికంగా ఉంటోంది. ఇది కొత్తగా ఏర్పడిన కీటకం కాదని, ఏళ్లుగా ఉన్నదేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ, ఈ కీటకం ప్రమాదకరంగా మారడానికి గల కారణాలు ఇప్పటికీ పూర్తిగా వెలుగులోకి రాలేదు. దేశవ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్నప్పటికీ, ఏపీలోనే మరణాలు ఎక్కువగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధి మూలాలు, వ్యాప్తి విధానం, బ్యాక్టీరియా రకాలను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
వివరాలు
అధ్యయనం వైపు అడుగులు
ప్రజారోగ్యానికి ప్రతి ఏడాది ఏదో ఒక కొత్త సవాలు ఎదురవుతుండటంతో, వైద్య రంగంలోని వివిధ విభాగాల నిపుణులను సలహాదారులుగా నియమించి వారి సూచనల మేరకు పరిస్థితిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటోంది. తాజాగా అంటువ్యాధుల నియంత్రణకు జాతీయ స్థాయి వైద్య సంస్థలు, కీలక రంగాల నిపుణులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది.