TG Indiramma Housing Scheme : ఈనెలాఖరు నుంచి ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత.. సర్కార్ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత కోసం ఆశగా ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే మొదటి విడత కింద ఎంపికైన పలువురు లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకుని, అనేక ప్రాంతాల్లో గృహ ప్రవేశాలు కూడా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రెండో విడత అమలుకు సర్కార్ సన్నాహాలు ప్రారంభించింది. ఈ విషయంపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. సోమవారం కూసుమంచిలో నిర్వహించిన 'ప్రజా దర్బార్' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజా దర్బార్లలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసమే దరఖాస్తులు వస్తున్నాయని వెల్లడించారు. గత ప్రభుత్వ వైఫల్యాల వల్లే పేదలకు గృహ సమస్య మరింత తీవ్రమైందని విమర్శించారు.
వివరాలు
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని, ఇందులో రాజకీయ జోక్యానికి ఎలాంటి అవకాశం ఉండదని హామీ ఇచ్చారు. మొదటి విడత ఇళ్ల నిర్మాణం సింహభాగం పూర్తయిన నేపథ్యంలో, మే నెలాఖరు నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రారంభమవుతుందని మంత్రి ప్రకటించారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రతి సోమవారం నేరుగా నిధులు జమ చేస్తున్నామని తెలిపారు. అధికారులు ప్రజల వద్దకే వెళ్లి సేవలు అందించడమే 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొంటూ, ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని గుర్తుచేశారు.
వివరాలు
ప్రభుత్వం రైతులను రాజులుగా నిలబడుతోంది
గతంలో మద్దతు ధర కోరిన రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని ఆరోపిస్తూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రాజులుగా నిలబెడుతోందని అన్నారు. అలాగే మే 5, 6, 7 తేదీలలో వరంగల్‌లో సబ్సిడీపై వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక'లో భాగంగా సోమవారం నుంచి 'రైతు వారోత్సవాలు' ప్రారంభమవుతాయని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పాలేరు నియోజకవర్గంలోని ప్రతి మండలాన్ని క్లస్టర్లుగా విభజించి ప్రజా దర్బార్లను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 99రోజుల ప్రగతి ప్రణాళిక ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకు తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి న్యాయబద్ధమైన దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి పరిష్కరిస్తామని కలెక్టర్ దివాకర్ టి.ఎస్ హామీ ఇచ్చారు.