India-Canada row:ఖలిస్థానీ గ్రూపులను రహస్యంగా కలుస్తున్న పాక్ గూఢచారి ఏజెంట్లు
కెనడాలో ఉన్న పాకిస్థాన్ గూఢచార సంస్థ ISI ఏజెంట్లు, ఖలిస్థానీ టెర్రర్ గ్రూపుల చీఫ్‌లు ఇటీవల వాంకోవర్‌లో రహస్య సమావేశం నిర్వహించారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ సమావేశానికి సిక్కులు ఫర్ జస్టిస్ (ఎస్‌ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్, ఇతర ఖలిస్తానీ సంస్థల అధినేతలు హాజరయ్యారని నిఘా వర్గాలు తెలిపాయి. ఐఎస్‌ఐ ఏజెంట్లు, ఖలిస్తానీ గ్రూపుల మధ్య జరిగిన భేటీలో.. వీలైనంత వరకు భారత్‌పై వ్యతిరేక ప్రచారం చేసేందుకు వీరు ప్లాన్ వేశారు. 'ప్లాన్-కె' పేరుతో రూపొందించిన ఈ ప్లాన్‌లో భాగంగా కెనడాలో గత కొన్ని నెలలుగా ఖలిస్తాన్ కార్యకలాపాలకు ఐఎస్‌ఐ పెద్ద ఎత్తున నిధులు సమకూరుస్తోందని నిఘా వర్గాలు తెలిపాయి.
ట్రూడో ఆరోపణలను తోసిపుచ్చిన భారత్
ఈ నిధులు నిరసనలు నిర్వహించేందుకు ప్రజలను రెచ్చగొట్టేందుకు, భారత వ్యతిరేక ప్రచారానికి పోస్టర్లు, బ్యానర్లు తయారు చేసేందుకు వినియోగిస్తున్నారు. జూన్‌లో బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు,భారతీయ ఏజెంట్లకు మధ్య ఉన్న సంబంధాన్ని కెనడా భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణల నేపథ్యంలో భారతదేశం, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. ట్రూడో ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. ఈ విషయంపై ఒట్టావా ఒక భారతీయ అధికారిని బహిష్కరించినందుకు టిట్-ఫర్-టాట్ ఎత్తుగడలో కెనడియన్ సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించింది.
కెనడాలో 20 మందికి పైగా ఖలిస్తానీలు, గ్యాంగ్‌స్టర్లు
ప్రస్తుతం కెనడాలో 20 మందికి పైగా ఖలిస్తానీలు, గ్యాంగ్‌స్టర్లు తలదాచుకుంటున్నారు. దీనికి సంబంధించి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)గట్టిగానే విచారణ చేపట్టేందుకు ప్రయత్నిస్తోంది. కానీ కెనడా దర్యాప్తు సంస్థల విచారణకు సహకరించడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో, పంజాబ్,భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో తీవ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్న తొమ్మిది ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాద సంస్థల జాబితాను కెనడాకు భారత్ అందజేసింది. కానీ కెనడా ఈ విషయంలో కెనడా భారత్‌కి సపోర్ట్ ఇవ్వడం లేదు.