Rifle Scope: సిద్రా గ్రామంలో చైనా తయారీ రైఫిల్ స్కోప్.. అప్రమత్తమైన భద్రతా దళాలు
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రాంతీయ కార్యాలయం సమీపంలో చైనా తయారీ శక్తివంతమైన రైఫిల్ టెలిస్కోప్ (స్కోప్) ఒకటి లభించడంతో కలకలం రేగింది. ఈ ఘటన భద్రతా దళాలను అప్రమత్తం చేసింది.ఉగ్రవాద వ్యతిరేక దర్యాప్తు కార్యాలయానికి దగ్గరలోనే ఇలాంటి యుద్ధ పరికరాలు కనబడటంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. జమ్మూ జిల్లా శివారులలోని సిద్రా ప్రాంతంలోని అస్రారాబాద్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారి ఆడుకుంటూ ఉన్నప్పుడు స్థానికులు ఒక వింత వస్తువును గమనించారు. ఆ చిన్నారి దానిని బొమ్మగా భావించి ఆడుతుండగా,గ్రామస్థులు అది రైఫిల్‌కు అమర్చే టెలిస్కోప్ అని గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఉదయం ఒక చెత్త కుప్పలో ఆ వస్తువు దొరికిందని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు.
వివరాలు
సాంబా జిల్లాలో 24 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
పోలీసుల ప్రాథమిక పరిశీలనలో, అది చైనాలో తయారైన రైఫిల్ స్కోప్ అని నిర్ధారించారు. సాధారణంగా దీన్ని అసాల్ట్ రైఫిళ్లకు లేదా స్నిపర్ రైఫిళ్లకు అమర్చి, దూరంలోని లక్ష్యాలను గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఎన్ఐఏ కార్యాలయం,జమ్మూ-కశ్మీర్ పోలీస్ సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్, సీఆర్‌పీఎఫ్, ఎస్ఎస్‌బీ బేటాలియన్ల కేంద్రాల వంటి అత్యంత సున్నిత ప్రాంతంలో ఈ స్కోప్ కనబడటంతో భద్రతా సంస్థలు ఆందోళనలో ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు జమ్మూలోని సాంబా జిల్లాలో 24 ఏళ్ల తన్వీర్ అహ్మద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాలు
గాలింపు చర్యలు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్
దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ నివాసి అయిన తన్వీర్ మొబైల్‌లో ఒక పాకిస్థానీ ఫోన్ నంబర్ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, అతడికి ఈ స్కోప్ దొరకడంతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు. సిద్రా ప్రాంతంలోని మొత్తం ప్రాంతాన్ని స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG),స్థానిక పోలీసుల బలగాలు కవర్ చేసి గాలింపు చర్యలు చేపట్టాయి. టెలిస్కోప్ ఉద్దేశపూర్వకంగా అక్కడ ఉంచారా, లేక దాడుల కోసం ప్రణాళిక చేస్తున్నారా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ, పోలీసులు ప్రజలకు ఎలాంటి భయం కలగదని భరోసా కూడా ఇచ్చారు.