Salman Khan: బాబా సిద్ధిఖీ హత్య.. సల్మాన్ ఖాన్‌కు భారీ భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు
ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) సీనియర్ నేత, బాంద్రా మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనతో పాటు రాజకీయ వర్గాలు, బాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో బాబా సిద్ధిఖీకి సన్నిహితుడైన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు కూడా ప్రమాదం పొంచి ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. లారెన్స్ బిష్ణోయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సమాచారంలో సల్మాన్ ఖాన్ పేరును ప్రస్తావించడం గమనార్హం. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, అనుజ్ థాపన్‌కి బాబా సిద్ధిఖీతో ఉన్న సాన్నిహిత్యమే బాబా సిద్ధిఖీ హత్యకు కారణమని పేర్కొన్నారు.
బాబా సిద్ధిఖీకి నివాళులర్పించిన సల్మాన్ ఖాన్
దావూద్ గ్యాంగ్‌కు సహాయం చేసిన వారు భారీ మూల్యం చెల్లించాల్సిందేనని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ ఖాన్‌కి, ఆయన కుటుంబ సభ్యులకు కూడా భద్రత కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ కారణంగా సల్మాన్ ఖాన్ తన సినిమా షూటింగ్ షెడ్యూల్స్, వ్యక్తిగత మీటింగ్స్ అన్నింటిని క్యాన్సిల్ చేసుకున్నారు. ఆదివారం సల్మాన్ ఖాన్ తన కుటుంబంతో కలిసి మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ ఇంటికి వెళ్లి, ఆయనకు నివాళులర్పించారు. అనంతరం బాంద్రాలోని తన ఇంటికి తిరిగి వెళ్లిపోయారు.