Hoax calls: భద్రతలో రాజీ పడేదేలే.. బాంబు బెదిరింపులపై రామ్మోహన్ నాయుడు సీరియస్
విమానయాన భద్రతపై కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పౌర విమానయాన భద్రతను మరింత పటిష్టం చేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని, బెదిరింపులకు పాల్పడే వారిని నో-ఫ్లై జాబితాలో చేర్చేలా చట్టాలను సవరిస్తున్నామని హెచ్చరించారు. ఇటీవల విమానాలకు వస్తున్న బెదిరింపులు పూర్తిగా తప్పుడు ప్రయోజనాల కోసమే జరుగుతున్నాయని, ప్రభుత్వం వాటిపై తగిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. విలేకర్ల సమావేశంలో రామ్మోహన్ నాయుడు ఆయన మాట్లాడారు. ఇటీవల పలు విమానాలకు బెదిరింపులొచ్చాయని, వాటిపై తక్షణ చర్యలు తీసుకుని భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నామని, గత వారంలో 90కి పైగా వచ్చిన బెదిరింపులలో ఏ ఒక్కటి కూడా వాస్తవం లేదన్నారు.
దర్యాప్తు కొనసాగుతోంది
భద్రతా నియమాల విషయంలో రాజీ పడకుండానే దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు. రాబోయే రోజుల్లో సివిల్ ఏవియేషన్ చట్టాలను మరింత పటిష్టం చేసేందుకు పరిశీలన చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 1982లో అమల్లోకి వచ్చిన సేఫ్టీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ చట్టాన్ని సవరించే యోచనలో ఉన్నామని, విదేశీ విధివిధానాలను అనుసరిస్తూ కఠినమైన ప్రోటోకాల్‌లను అమలు చేయనున్నామని రామ్మోహన్ నాయుడు చెప్పారు. గత వారం రోజుల్లోనే ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియా, ఆకాశ ఎయిర్ వంటి సంస్థలకు చెందిన విమానాలకు పలు బెదిరింపులు రావడంతో వాటిలో కొన్నింటిని వేరే మార్గాలకు మళ్లించారు.