
జేపీ నడ్డా సమక్షంలో ఇవాళ బీజేపీలో చేరనున్న జయసుధ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ సినీనటి జయసుధ ఇవాళ బీజేపీ పార్టీలో చేరనున్నారు.
ఈ మేరకు మంగళవారం దిల్లీకి పయనమయ్యారు. బుధవారం సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలోకి చేరనున్నారు.
కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ పాల్గొననున్నారు.
భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేతలు ఇటీవలే తమ పార్టీలోకి రావాలని జయసుధను కోరారు. దీంతో జయసుధ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగి గెలుపొందారు.
ఈ మేరకు 2009 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. నియోజకవర్గంలో విజయం సాధించేందుకు క్రిస్టియన్ల ఓట్లు కీలకంగా మారాయని గతంలో చర్చ జరిగింది.
DETAILS
మళ్లీ అదే ఫార్ములాతో బరిలోకి దిగనున్న జయసుధ
మరోసారి సేమ్ ఫార్మూలాతో జయసుధను బరిలోకి దించాలని దిల్లీ కమలనాథులు భావిస్తున్నారు. మరోవైపు సికింద్రాబాద్ నుంచే మళ్లీ పోటీ చేయాలని జయసుధ భావిస్తున్నారు. ముషీరాబాద్, ఉప్పల్ పేరు వినికిడిలో ఉంది.
త్వరలోనే ఈ మేరకు పార్టీ అధిష్టానం స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాషాయ కండువా కప్పుకున్నాక అమిత్ షాతో భేటీ కానున్నారు.
ఈ ఏడాది చివర్లో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే బలమైన అభ్యర్థుల కోసం భాజపా సన్నద్ధమవుతోంది.
ఏపీ విభజన తర్వాత 2016లో నవ్యాంధ్రప్రదేశ్ స్థాపన కోసమే తెలుగుదేశంలో చేరినట్లు జయసుధ పేర్కొన్నారు. అనంతరం 2019లో వైసీపీలో చేరారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనే మరోసారి ఎమ్మెల్యేగా గెలవాలని జయసుధ కార్యచరణ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.