బండి సంజయ్‌కు కీలక పదవి.. ఉత్తర్వులు జారీ చేసిన హైకమాండ్
తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో బీజేపీ అదిష్టానం మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తప్పించిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పగ్గాలను అప్పగించారు. తెలంగాణలో బీజేపీ అభ్యున్నతికి కృషి చేసిన బండి సంజయ్ ను అధ్యక్షుడిగా తప్పించడంపై చాలా కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ ను నియమిస్తూ హైకమాండ్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బండి సంజయ్ అనుచరులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ
ఇదే సమయంలో తెలంగాణ నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ కొనసాగుతుండగా, ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్ కొనసాగనున్నారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బీజేపీ జాతీయ కమిటీని ప్రకటించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ దిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఈటెల రాజేందర్ రెడ్డి దిల్లీకి బయలుదేరనున్నారు. బీజేపీ కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించడం కోసమే సంజయ్ కు కీలక పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది.