LOADING...
Lalu-Rabri Security: లాలూ కుటుంబ భద్రతపై సంచలన నిర్ణయం.. కర్రలతో కాపలాగా ఆర్జేడీ కార్యకర్తలు
లాలూ కుటుంబ భద్రతపై సంచలన నిర్ణయం.. కర్రలతో కాపలాగా ఆర్జేడీ కార్యకర్తలు

Lalu-Rabri Security: లాలూ కుటుంబ భద్రతపై సంచలన నిర్ణయం.. కర్రలతో కాపలాగా ఆర్జేడీ కార్యకర్తలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 06, 2026
04:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవిలకు కల్పించిన అత్యున్నత 'జెడ్ ప్లస్' భద్రతను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో పెద్ద వివాదం చెలరేగింది. ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన లాలూ దంపతులు, తమకు కొత్తగా కేటాయించిన భద్రతా సిబ్బందిని తిరస్కరించి తిరిగి పంపించేశారు. దీంతో వారి నివాసం వద్ద ఆర్జేడీ కార్యకర్తలు కర్రలతో కాపలా కాస్తూ కనిపించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బీహార్‌లో వీఐపీల భద్రతపై ఇటీవల నిర్వహించిన సమీక్ష అనంతరం రాష్ట్ర ప్రభుత్వం లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిల జెడ్ ప్లస్ భద్రతను తొలగించింది.

వివరాలు

'వై' కేటగిరీ భద్రతను తిరస్కరించిన తేజస్వి యాదవ్

దాని స్థానంలో బీహార్ స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ (BSAP) సిబ్బందితో కొత్త భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ కొత్త భద్రతా వ్యవస్థలో ఇద్దరు నుంచి ఎనిమిది మంది హౌస్ గార్డులు, ఇద్దరు బాడీగార్డులు, ఒక పైలట్ వాహనం, బుల్లెట్‌ప్రూఫ్ కారు వంటి ఏర్పాట్లు ఉన్నాయి. అయితే ఈ భద్రతను నామమాత్రపు రక్షణగా అభివర్ణించిన లాలూ కుటుంబం, 10 సర్క్యులర్ రోడ్‌లోని తమ నివాసం వద్ద ఉన్న భద్రతా సిబ్బందిని వెనక్కి పంపించింది. అదే విధంగా బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ కూడా తనకు కేటాయించిన 'వై' కేటగిరీ భద్రతను తిరస్కరించారు.

వివరాలు

లాలూ కుటుంబంపై ఆరోపణలు

లాలూ కుమార్తె రోహిణి ఆచార్య ఈ పరిణామంపై తీవ్రంగా స్పందించారు. తమ కుటుంబానికి హాని కలిగించాలనే ఉద్దేశంతోనే భద్రతను తగ్గించారని ఆమె ఆరోపించారు. భద్రత పేరుతో కేవలం చూపించడానికి మాత్రమే ఏర్పాట్లు చేయడం అర్థరహితమని వ్యాఖ్యానించారు. అందుకే రబ్రీదేవి భద్రతా సిబ్బందిని తిరస్కరించారని తెలిపారు. అలాగే ఆర్జేడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో 10 సర్క్యులర్ రోడ్ నివాసం వద్ద చేరుకుని, యాదవ్ కుటుంబానికి తామే నిజమైన రక్షణ కవచమని చూపించాలంటూ రోహిణి ఆచార్య పిలుపునిచ్చారు.

Advertisement

వివరాలు

ప్రభుత్వ బంగ్లా ఖాళీ వివాదం

ఈ వివాదానికి మరో కారణం కూడా ఉంది. ఇటీవల బీహార్ భవన నిర్మాణ శాఖ, రబ్రీదేవి ప్రస్తుతం నివసిస్తున్న 10 సర్క్యులర్ రోడ్ ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది. ఈ బంగ్లాను పాడి పరిశ్రమలు, మత్స్యశాఖ మంత్రి నంద్ కిషోర్ రామ్‌కు కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే రబ్రీదేవి మాత్రం బంగ్లాను ఖాళీ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. "ప్రభుత్వం బలవంతంగా ఖాళీ చేయిస్తే చేయించుకోండి. నేను స్వచ్ఛందంగా ఇల్లు వదిలిపెట్టను" అని ఆమె వ్యాఖ్యానించారు.

Advertisement

వివరాలు

రాజకీయ వేడి పెరుగుతోంది

లాలూ కుటుంబ భద్రత తగ్గింపు, ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలన్న ఆదేశాలు బీహార్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ఆర్జేడీ దీన్ని రాజకీయ కక్షసాధింపు చర్యగా ఆరోపిస్తుండగా, ప్రభుత్వం మాత్రం భద్రతా సమీక్షలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం లాలూ కుటుంబ నివాసం వద్ద ఆర్జేడీ కార్యకర్తల కాపలా కొనసాగుతోంది.

Advertisement