Page Loader
Meghalaya Honeymoon Case: మేఘాలయ హనీమూన్ హత్యలో సంచలన ట్విస్ట్.. ఆ ఒక్క క్లూతో మర్డర్ మిస్టరీ వీడింది! 
మేఘాలయ హనీమూన్ హత్యలో సంచలన ట్విస్ట్.. ఆ ఒక్క క్లూతో మర్డర్ మిస్టరీ వీడింది!

Meghalaya Honeymoon Case: మేఘాలయ హనీమూన్ హత్యలో సంచలన ట్విస్ట్.. ఆ ఒక్క క్లూతో మర్డర్ మిస్టరీ వీడింది! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 11, 2025
10:04 am

ఈ వార్తాకథనం ఏంటి

మేఘాలయ హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. భార్య సోనమ్ తన భర్తను కిరాతకంగా హత్య చేయించిన తీరు నెట్టింట వైరల్ అవుతోంది. పెళ్లైన కేవలం 15 రోజులలోనే భర్తను చంపిన అమానుష చర్య అందరినీ కలిచివేస్తోంది. ఇది సినిమా కథలా అనిపించేలా ఉన్నప్పటికీ, వాస్తవ సంఘటన. ఈ కేసులో విచారణ చేస్తున్న పోలీసుల నివేదికలు, తేలిన ఆధారాలు చూస్తే, సోనమ్‌ పాత్రపై విస్మయం కలగకుండా ఉండదు. ఆమె తన మాజీ ప్రేమికుడు రాజ్ కుశ్వాహా సహకారంతో ఈ హత్యను ఘరుగా ప్లాన్ చేసింది. తన భర్త రాజా రఘువంశీని హనీమూన్ సమయంలో హత్య చేయించి, దానిని అపహరణగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది.

Details

 హనీమూన్ టూర్‌గా షిల్లాంగ్

ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ మే 11న వివాహం చేసుకున్నారు. మొదట జమ్ము కశ్మీర్‌కు హనీమూన్ ప్లాన్ వేసినా, అక్కడ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో షిల్లాంగ్‌కి మారారు. మే 20న వారు మేఘాలయకు వెళ్లారు. అదే సమయంలో సోనమ్‌ తన బాయ్‌ఫ్రెండ్ రాజ్ కుశ్వాహాతో హత్యకు సంబంధించి చాట్లు కొనసాగిస్తూ, మిషన్‌ అమలుపై దృష్టిపెట్టినట్లు గుర్తించారు. ఒక జలపాతానికి దగ్గరలో జూన్ 2న రాజా మృతదేహం కనిపించడంతో కేసు మలుపు తిరిగింది. పోస్టుమార్టం ప్రకారం అతని తలపై పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేసినట్లు నిర్ధారించారు. అయితే ఆ ఆయుధం మేఘాలయ ప్రాంతానికి చెందిందే కాకపోవడంతో ఇతర ప్రాంతాల వ్యక్తులు కూడా ఇందులో కలిశారని పోలీసులు అనుమానించారు.

Details

 సోనమ్ ఫోన్ కాల్... కేసులో కీలక మలుపు

సోనమ్ చేసిన ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు ఆమెపై కన్నేశారు. ఫోన్ లొకేషన్ డేటా, హంతకుల ఫోన్‌ల లొకేషన్‌లతో మ్యాచ్ అయ్యింది. దీంతో సోనమ్‌ను ఘాజీపూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. విచారణలోనే అసలు మాస్టర్ మైండ్‌గా రాజ్ కుశ్వాహా పేరు బయటపడింది. హత్య జరిగిన ప్రదేశానికి వెళ్ళకుండా, అతను మార్గదర్శకత్వం అందించినట్లు తేలింది. విచిత్రమైన విషయం ఏమిటంటే, రాజ్ కుశ్వాహా రాజా రఘువంశీ అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.

Details

ప్రేమ పేరుతో దారుణానికి ఒడిగట్టిన సోనమ్ 

సోనమ్ - రాజ్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్స్‌లో వారి పక్కా కుట్ర స్పష్టమైంది. సోనమ్ భర్తను వదిలి రాజ్‌తో జీవితం గడపాలని నిర్ణయించుకుంది. రాజ్ కుశ్వాహా తన ముగ్గురు స్నేహితులతో కలిసి రాజా రఘువంశీని హత్య చేసినట్లు సమాచారం. ఇప్పటికే సోనమ్‌, రాజ్‌, హత్యకు పాల్పడిన స్నేహితులు పోలీసుల అదుపులోకి వచ్చారు. కానీ ఈ కేసు సామాజికంగా తీవ్రమైన చర్చకు దారితీసింది "ఒకరి మీద ప్రేమ ఉంటే, మరొకరిని ఎందుకు వివాహం చేసుకోవాలి?", "పెళ్లైన వెంటనే ఇలా నేరానికి పాల్పడే ధైర్యం ఎలా వస్తోంది? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.