
Train Incident: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన కామాఖ్య ఎక్స్‌ప్రెస్!
ఈ వార్తాకథనం ఏంటి
ఒడిశాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి గువాహటి వెళ్తున్న కామాఖ్యా ఎక్స్‌ప్రెస్ (12251) రైలు 11 బోగీలు పట్టాలు తప్పాయి.
రైల్వే అధికారుల ప్రకారం, ఈ ఘటన గత రాత్రి 11.54 గంటల సమయంలో కటక్ సమీపంలోని నేరగుండి స్టేషన్ (ఖుర్దా డివిజన్) వద్ద జరిగింది.
అదృష్టవశాత్తూ, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఈస్ట్ కోస్ట్ రైల్వే సీపీఆర్‌ఓ అశోక్ కుమార్ మిశ్రా వెల్లడించారు.
పట్టాలు తప్పిన 11 బోగీలు ఏసీ కోచ్‌లు అని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. రైల్వే ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పునరుద్ధరణ పనులను చేపట్టారు.
Details
రైళ్ల రూట్ల మార్పు
ఈ ప్రమాదం కారణంగా కొన్ని రైళ్ల మార్గాలను మార్చినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
ట్రాక్ పునరుద్ధరణ పూర్తయ్యే వరకు కొన్ని రైళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో నడుస్తాయని తెలిపారు.
ప్రయాణికుల సౌలభ్యం కోసం రైల్వే శాఖ హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల చేసింది. దిగ్విజయ్ ప్రాంతానికి సంబంధించి 8991124238 నంబర్‌ను అందుబాటులో ఉంచారు.
Details
ఓడిశాలో తరచూ రైలు ప్రమాదాలు
కొంతకాలంగా ఓడిశాలో రైలు ప్రమాదాలు పునరావృతమవుతున్నాయి. 2023లో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
శాలిమార్-చెన్నై కొరొమండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఓ మాల్గాడి రైలు ఒకదానికొకటి ఢీకొనడంతో 296 మంది మరణించగా, 1,200 మందికి పైగా గాయపడ్డారు.
అంతకుముందు 2022లో కోరాయి రైల్వే స్టేషన్ వద్ద ఓ మాల్గాడి పట్టాలు తప్పి స్టేషన్ భవనాన్ని ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, 12 బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.